ప్లీజ్ ఇప్పుడు వెళ్లొద్దు..! ధ‌ర్మారంలో హైటెన్షన్ కంటిన్యూ..!

by Bhoopathi Nagaiah |
ప్లీజ్ ఇప్పుడు వెళ్లొద్దు..! ధ‌ర్మారంలో హైటెన్షన్ కంటిన్యూ..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం ధ‌ర్మారంలో హైటెన్షన్ కొన‌సాగుతోంది. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఈ మండ‌లంలో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గత క‌ల‌హాలు, వ‌ర్గ విబేధాలు రాజేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖ‌- ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. దసరా వేడుక‌ల‌ను పుర‌స్కరించుకుని గీసుకొండ మండలం ధర్మారం ఏరియాలో కొంత‌మంది కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేక‌పోవ‌డంతో ర‌గ‌డ మొద‌లైంది. దీంతో పాటు 16వ డివిజ‌న్ ప‌రిధి ధ‌ర్మారంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫ్లెక్సీల‌ను మంత్రి కొండా సురేఖ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు చింపివేయ‌డంతో పాటు ఎమ్మెల్యే రేవూరి అనుచ‌రుడు పిట్టల అనిల్‌పై దాడి చేశారు. పిట్టల అనిల్‌, డివిజ‌న్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూపాకి సంతోష్ ఫిర్యాదు మేర‌కు కొండా సురేఖ వ‌ర్గానికి చెందిన మొత్తం 8 మందిపై గీసుకొండ పోలీసులు కేసు న‌మోదు చేశారు. కొండా వ‌ర్గానికి చెందిన బండి రాజు, ముస్కు సురేష్‌, కూస రాజ్‌కుమార్‌,చుంచు రాజు, చౌడ శివ‌కుమార్‌,, ముస్కు రంజిత్‌కుమార్‌, మ‌హేశ్వర్‌, వంశీల‌పై కేసు న‌మోదైంది. గీసుకొండ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

దీనికి నిరసనగా కొండా వర్గీయులు ఆదివారం ఆందోళనకు దిగారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడిచి పెట్టాలనే డిమాండ్ తో ధర్మారం వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మంత్రి సురేఖ నేరుగా ధర్మారం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఒక ఆటోలో గీసుకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై చేయి చేసుకున్న డీసీపీ, ఏసీపీ, ఇన్ స్పెక్టర్‌ను విధుల నుంచి రిలీవ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సమాచారం తెలియగానే కొండా వర్గీయులు వివిధ గ్రామాల నుంచి గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో కొద్దిసేపు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గీసుకొండ పోలీస్ స్టేషన్ చేరుకొని మంత్రితో మాట్లాడారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి సురేఖ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రేవూరి వర్సెస్ కొండా వర్గీయుల మధ్య జరుగుతున్న వార్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది

కుడా చైర్మ‌న్‌, వ‌రంగ‌ల్ డీసీసీ అధ్య‌క్షురాలు స్వ‌ర్ణ‌కు సీపీ రిక్వెస్ట్‌..!

కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విబేధాల‌ను వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఎలాంటి అల‌జ‌డులు జ‌ర‌గ‌కుండా నిరోధించాల‌ని రాష్ట్ర పోలీస్ ఉన్న‌తాధికారుల నుంచి అందిన సూచ‌న‌ల‌తో అంబ‌ర్ కిశోర్‌ఝా అల‌ర్ట్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా వ‌రంగ‌ల్ డీసీసీ అధ్య‌క్షురాలు ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో పోటీ చేయ‌డంతో పాటు సుదీర్ఘ‌కాలం పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గంతో రాజ‌కీయ అనుబంధం క‌లిగిన కుడా చైర్మ‌న్ ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి సోమ‌వారం ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్లేందుకు బ‌య‌ల్దేర‌గా సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా వ‌ద్ద‌ని రిక్వెస్ట్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. సీపీ సూచ‌న‌ల‌తో వారు సైతం త‌మ ప‌ర్య‌ట‌న‌ను తాత్క‌లికంగా వాయిదా వేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story