పది మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు.. నాలుగు వారాల గడువు

by Gantepaka Srikanth |
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాలని, కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలంటూ నాలుగు వారాల గడువు ఇచ్చింది. పార్టీ మార్పుపై వారు ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పార్టీ-ఇన్-పర్సన్‌గా హాజరైన కేఏ పాల్ ఆ పది మంది పార్టీ మారినందువల్ల రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని వాదించారు. అప్పటివరకూ వారు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న వేతనాలు, అలవెన్సులను వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా చూడాలని, ఏదైనా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తే దాంట్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలని కోరారు. పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్‌క్వాలిఫై చేయాలని, 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారణ సందర్భంగా కేఏ పాల్ ప్రస్తావించారు.

పది మంది పార్టీ మార్పు విషయంలో కేఏ పాల్ తన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు, వాదనల సందర్ధంగా ప్రస్తావించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీజే బెంచ్... ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. పార్టీ మార్పుపై వివరాలతో కూడిన అఫిడవిట్‌ను నాలుగు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నది. కానీ పిటిషనర్ ప్రస్తావించిన పదవ షెడ్యూలులోని అంశంపైనా, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించడంపైనా ఏకీభవించలేదు. వారు ప్రభుత్వం నుంచి అందుకుంటున్న వేతనాలు, అలవెన్సుల విషయంలోనూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. పార్టీ మార్పుపై వారు ఇచ్చే వివరణకు అనుగుణంగా నాలుగు వారాల తర్వాత జరిగే విచారణలో కోర్టు తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లో చేరడంపై కేంద్ర ఎన్నికల కమిషన్, అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని కూడా కేఏ పాల్ ప్రస్తావించారు.

ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉన్నది. ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరినందున వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్‌కు చెందిన కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు... నెల రోజుల వ్యవధిలో ఆ ముగ్గురిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని స్పీకర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ వివరణ రానిపక్షంలో సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ షెడ్యూలుపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ పేర్కొన్నది. స్పీకర్ కార్యాలయం కూడా నాలుగు వారాల తర్వాత జరిగే విచారణ షెడ్యూలును కోర్టుకు అందజేయాలని కోరింది. ఈ పిటిషన్‌తో సంబంధం లేకుండా కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సీజే బెంచ్ విచారణకు తీసుకున్నది. పదిమంది ఎమ్మెల్యేల నుంచి వచ్చే వివరణ తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నది.

Next Story

Most Viewed