Harish Rao: సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి

by Gantepaka Srikanth |
Harish Rao: సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అత్యాచార బాధితులకు భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మంగళవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదన్నారు.

చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి కూడా ఉపయోగం లేదనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం నెలకొందన్నారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం అన్నారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం, ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం, నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story