- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: హైదరాబాద్‌లో తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గత కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో ఇలాంటి తాగునీటి సంక్షోభం లేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే పరిస్థితి విషమించిందన్నారు. నివేదికల ప్రకారం, తెలంగాణలో భూగర్భజలాలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు అడుగంటిపోయాయని తెలిపారు. దేశంలోనే భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. అసలు ప్రభుత్వానికి దీనిపై ఏం జరుగుతుందో తెలుసా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో 15 శాతం అదనపు వర్షపాతం నమోదైనా, భూగర్భజలాలు 1.33 మీటర్లు తగ్గాయన్నారు. కూకట్‌పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. అక్కడ భూగర్భ జలమట్టం ఏకంగా 25.90 మీటర్ల లోతుకు పడిపోయిందని, ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు కొండెక్కి విలవిలలాడుతున్న సామాన్యులు నీటి ట్యాంకర్ల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. చరిత్ర చెబుతోంది కాంగ్రెస్ పాలనలో నీటి కటకట తప్పదని, అది మరోసారి నిజమైందన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిందని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలో మత్తడులు దుంకిన చెరువులు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, చెరువులు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచారంలోనే మునిగిపోయిందని, పాలనపై కాకుండా, రాజకీయ కక్ష సాధింపు చర్యలతో బిజీగా ఉందని విమర్శించారు. హైదరాబాద్ నీటి గుక్కెడు మంచి నీళ్ళ కోసం అల్లాడుతోందని, కానీ కాంగ్రెస్ మాత్రం బాధ్యత వహించకుండా తప్పించుకుంటోందని, ఇది వారి పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు.