Harish Rao: రాష్ట్రంలో సర్కార్ మొద్దు నిద్రపోతోంది: మాజీ మంత్రి హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
Harish Rao: రాష్ట్రంలో సర్కార్ మొద్దు నిద్రపోతోంది: మాజీ మంత్రి హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పాలన అటకెక్కిందని, సర్కార్ మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి ఆరోపించారు. గ్రామం పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. నేడే ఆ కార్మికులకు జీతాలే కరువయ్యాయని తెలిపారు. కేసీఆర్ హాయాంలో ప్రతినెలా పంచాయతీల రూ.275 కోట్లు టంచన్ విడుదల చేసేవాళ్లమని అన్నారు. మార్చి కంటే ముందు కేంద్రం రూ.500 కోట్లు పంచాయతీలకు విడుదల చేసిందని, అదే రాష్ట్రంలో ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదని అన్నారు.

రెండు నెలల పాటు ఆసరా పెన్షన్లు ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిస్తేనే ఆ డబ్బులు విడుదల చేశారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే వారి విషయాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లాకే చలనం వచ్చిందని అన్నారు. దాదాపు రూ.2,500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ రాష్ట్రం‌లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్లే పథకాలపై ప్రభావం పడిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం రూ.350 కోట్లు విడుదల చేయలేదని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, సెక్రటరీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని నిధులు లేక జేబులోంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభం కోట్టుమిట్టాడుతోందని, కరెంట్ కోతలకు ప్రభుత్వం చిత్ర విచిత్ర కారాణాలు చెబుతోందని అన్నారు. కరెంట్ బిల్లులు కట్టలేదంటూ గ్రామ పంచాయతీలు, ప్రభుత్వం పాఠశాలలకు సర్వీసును తొలగిస్తున్నాని ఫైర్ అయ్యారు. చివరకు పోలీసుల వాహనాలకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కల్యాణ‌లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయగా బ్యాంకులకు వెళితే.. బౌన్స్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు రుణ‌మాఫీ‌కి రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం చెప్పినా.. పీఎం కిసాన్ యోజన‌కు రైతు రుణ‌మాఫీకి లింక్ పెడుతున్నారని ఆరోపించారు. తమ లెక్కల ప్రకారం రూ.లక్షలోపు రుణ మాఫీ‌కి అర్హులైన వారిలో 30 నుంచి 40 శాతం మందికి రుణం మాఫీ కాలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం హయాంలో ఐ‌ఏ‌ఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి బీహార్ బ్యాచ్ అంటూ కామెంట్ చేశారని గుర్తు చేశారు. నేడు అర్హత గల తెలంగాణ బిడ్డలు చాలామంది ఉండగా డీజీపీ‌గా పంజాబ్‌కు చెందిర వ్యక్తిని ఎందుకు నియమించారో చెప్పాలన్నారు. ఇక ఆలిండియా సర్వీసెస్‌లో వికలాంగులు పనికిరారంటూ స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏమాత్రం ఏకీభవించడం లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు.



Next Story