Harish Rao: రాజకీయ కక్షలో భాగంగానే హైడ్రా దాడులు.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-08-25 15:15:22.0  )
Harish Rao: రాజకీయ కక్షలో భాగంగానే హైడ్రా దాడులు.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఇప్పటివరకు ఆరు అక్రమ కేసులు పెట్టారని. రాజకీయ కక్షలో భాగంగానే హైడ్రాతో దాడులు చేయిస్తు్న్నారని, ఆసుపత్రులు, కాలేజీలను రాజకీయ కక్ష్యలకు కేంద్రంగా మార్చొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరు కేసులు పెట్టారని ఆయనపైనే కాకుండా ఆయన భార్యపిల్లలు ఎవరిపైనో దాడి చేశారని అక్రమ కేసులు పెట్టారని, పల్లాను మానసికంగా పొలిటికల్‌గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని అన్నారు. హైడ్రా పేరు చెప్పి నియమనిబందనలు లేకుండా పల్లా ఇనిస్టిట్యూషన్లపై దాడి చేయిస్తున్నారని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బదీసే ప్రయత్నాలు చేయడం సరైనది కాదని, పల్లా కాలేజీలో ఇంచ్ భూమి ప్రభుత్వానిది ఉన్నా 24 గంటల్లో ఆయనే కూలగొట్టిస్తాడని చెప్పారు.

పల్లా మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ 813/పి 2018 లో వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చబడిందని, అందులో చెరువు శికం భూమి ఉంటే అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించారు. అలాగే మెడికల్ కాలేజీ విషయంలో ఇరిగేషన్, హెచ్ఎండీఏ సహా అధికార యంత్రాంగం అంతా ఎన్ఓసీలు, పర్మిషన్లు ఇచ్చిన తర్వాత దాడి చేస్తామంటే ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమేనని ఆరోపించారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని, అక్రమాలను సమర్ధించమని చెబుతూ.. టార్గెటెడ్ గా పొలిటికల్ గా కుట్రలు చేస్తే అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దని, దయచేసి డాక్యూమెంట్లు అన్ని పరిశీలించిన తర్వాత నోటీసులు ఇచ్చి అప్పుడు కూల్చివేతలు జరపాలన్నారు. రాజకీయంగా కుట్రలు చేసి రాత్రికి రాత్రే దాడి చేసే బుల్డోజింగ్ పద్దతి సరికాదన్నారు. ఆసుపత్రులు, కాలేజీలను రాజకీయ కక్ష్యలకు కేంద్రంగా మార్చొద్దని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడం మంచిది కాదన్నారు.

రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్టుగా వార్తల్లో ఎటు చూసినా హైడ్రానే కనిపిస్తుందని, గతంతో పోలిస్తే 36 శాతం డెంగీ కేసులు ఎక్కువయ్యాయని, ఆసుపత్రుల్లో బెడ్లు దొరికట్లేదని, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరట్లేదని, ప్రజలు ప్రైవేట్ దుకాణాల్లో తెచ్చుకుంటున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక రుణమాఫీ విషయానికి వస్తే మంత్రులు తలో మాట మాట్లడుతున్నారని, చెయ్యచేతగాక కుంటిసాకులు చెబుతున్నారని, రుణమాఫీపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ అని, అదానీ మీద అయిన, అన్నదాత మీద అయిన ద్వంద్వపాలన విధానమేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దేవుళ్లకు క్షమాపణ చెప్పి రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు భరోసా లేక చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నాట్లు, కలుపులు అయిపోయాయని, కనీసం ఎరువు బస్తాలకైనా రైతు భరోసా అందించాలని కోరారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని, అసలు అయ్యింది 4 లక్షల 26 వేల కోట్లు అయితే తిమ్మిని బమ్మిని చేసి 7 లక్షల పైచిలుకు అప్పులు చూపిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి గత ప్రభుత్వంపై బురద జల్లుతామంటే ఊరుకునేది లేదని హరీష్ రావు అన్నారు.

Advertisement

Next Story