కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు అన్యాయం: హరీష్ రావు ఫైర్

by Satheesh |   ( Updated:2024-07-23 15:23:33.0  )
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు అన్యాయం: హరీష్ రావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిమాండ్లపై అసెంబ్లీలో రెండు రోజులే చర్చా..? ఇది దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ఎగవేతనే కాదు.. అసెంబ్లీ సమయంపై ఎగవేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులకే కుదిస్తున్నారని, బీఏసీ సమావేశంలో కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశామన్నారు. కేసీఆర్ పాలనలో తొమ్మిది రోజులు డిమాండ్లపై చర్చ జరిగేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు.

పాలక పక్షం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని, బుధవారం ఎజెండాను ఇంకా ఖరారు చేయలేదన్నారు. రాత్రి ఎజెండాను నిర్ణయిస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారని నిలదీశారు. నిరుద్యోగుల అంశంపై బుధవారం చర్చ చేపట్టాలన్నామని, తొమ్మిది అంశాలను చర్చకు ప్రతిపాదించామన్నారు. శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గ్యారంటీలు చట్టబద్ధత, రైతు రుణమాఫీ ఆంక్షలు, అన్ని పంటలకు బోనస్, రైతు భరోసా, పల్లెలు.. పట్టణాల్లో పారిశుధ్య లోపం, స్థానిక సంస్థలకు నిధులు, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు లాంటివి చర్చను పెట్టాలని కోరామన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా..? అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదన్నారు. తెలంగాణ కు బీజేపీ తీరని అన్యాయం చేసిందని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు.

Advertisement

Next Story