Harish Rao : గతేడాది బడ్జెట్ ప్రతులు కాపీ పేస్ట్ చేశారు : హరీష్ రావు

by M.Rajitha |
Harish Rao : గతేడాది బడ్జెట్ ప్రతులు కాపీ పేస్ట్ చేశారు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో నేడు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)రాష్ట్ర బడ్జెట్(State Budget) ప్రవేశ పెట్టారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో భట్టి అన్నీ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, కేవలం రూ.5 లక్షల రుణాలు మాత్రమే వడ్డీ లేకుండా ఇచ్చారని మిగతా ఋణాలకు 12 శాతం వడ్డీలు కడుతున్నారని అన్నారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు ఊసే లేదని, కొత్తగా ఎవ్వరికీ ఇవ్వలేదని, ఉన్నవే తొలగించారని అన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులకు రూ.2500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఆ పథకం గురించి మర్చిపోయి అందాల పోటీలకు మాత్రం రూ.250 కోట్లు కేటాయించారని విమర్శించారు.

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అందరికీ చేశామని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని.. వేలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. గత బడ్జెట్ లో రాష్ట్రంలో 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, మళ్ళీ ఈ ఏడాది 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకున్నారని విమర్శించారు. పోయిన ఏడాది బడ్జెట్ ప్రతులనే ఈ ఏడాది చదివారు కానీ.. రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని.. అబద్దాలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు 12 శాతం ఉంటే, కాంగ్రెస్ హయాంలో 10 శాతానికి పడిపోయిందని అన్నారు.

తలసరి ఆదాయం బీఆర్ఎస్ పాలనలో 12.4 శాతం ఉంటే కాంగ్రెస్ పాలనలో 9 శాతానికి తగ్గిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని, గత ప్రభుత్వం అప్పులు చేసిందని నోరు పారేసుకుంటారు గాని, ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రాష్ట్రం 5 వేల కోట్ల మిగులు ఆదాయంలో ఉందని ప్రకటించారని.. ఇంకా అప్పులు ఎక్కడున్నాయో రేవంత్ చెప్పాలని నిలదీశారు.

Next Story