తెలంగాణ కోసం కొట్లాడినట్లు అసెంబ్లీలో CM రేవంత్ ఫోజులు: హరీష్ రావు ఫైర్

by Satheesh |   ( Updated:2024-07-29 11:34:35.0  )
తెలంగాణ కోసం కొట్లాడినట్లు అసెంబ్లీలో CM రేవంత్ ఫోజులు: హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినట్లు ఫోజు కొడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తి రేవంత్ రెడ్డి రైఫిల్ రెడ్డి అయ్యాడని, ఆయన ఏనాడు తెలంగాణ గూర్చి మాట్లాడలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నాటి తెలంగాణ టీడీపీ నేతలు కొందరు రాజీనామా జిరాక్స్ కాపీలు ఇచ్చారని, రేవంత్ రెడ్డి కనీసం ఆ జిరాక్స్ కాపీ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. సోమవారం హరీష్ రావు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కీలక చర్చలు జరుగుతోన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్‌గా వచ్చి సభను మిస్ గైడ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు లిఫ్ట్ సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజనీర్లు చేప్పారని రేవంత్ రెడ్డి సభను తప్పు దోవ పట్టించారని మండిపడ్డారు.

విద్యుత్ మీటర్లు విషయంలో వ్యవసాయ మోటార్లుకు మినహాయింపు అనేది చదవకుండా తప్పుదోవ పట్టించారని ఓ ముఖ్యమంత్రి ఇలా చదవడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. సభను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై సభాహక్కుల నోటీసు ఇస్తామని తెలిపారు. ఇవాళ పోతిరెడ్డి పాడు విషయంలో గత వైఎస్ సర్కారులో టీఆర్ఎస్ మంత్రులే తవ్వించారని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు మాట మాట్లాడారని, పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా 2005లో మేం ఆరుగురం మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని గుర్తు చేశారు. పులి చింతల కోసం నాటి కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ పెదవులు మూసుకున్నారని విమర్శించారు. ఓ సభా నాయకుడు మూడు రోజులు వరుసగా అబద్ధాలు మాట్లాడి సభ ఔనత్యాన్ని తగ్గిస్తున్నాడని నోరు ఉందని విరుచుకు పడుతున్నాడు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పని ఖతం అయ్యిందన్న వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయలేదు.. మరీ దేశంలో కాంగ్రెస్ ఖతం అయినట్టేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో రెండు సార్లు మా చేతిలో ఓడిపోయారన్నారు. 2014, 2018 కాంగ్రెస్ 20 సీట్లు దాటలేదు అయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా.. మేము 39 సీట్లు గెలిచాం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అసలైన వారిని పక్కనపెట్టారని వీహెచ్ లాంటి వారికి పదవులు లేవు.. బయటి నుంచి వచ్చిన వాళ్లకు పదవులిస్తున్నారని అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ కాంగ్రెస్ నాయకుల కృషితో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఢిఫెన్స్‌లో పడగానే సీఎం వచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. జైపాల్ రెడ్డి ఏనాడు రేవంత్ రెడ్డిని దగ్గరికి రానివ్వలేదని, రేవంత్ రెడ్డిని ఆయన పురుగుల చూసేవాడని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు జైపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి తెలంగాణ వాదులయ్యారని సెటైర్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed