Harish Rao: అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా?:హరీశ్ రావు

by Prasad Jukanti |
Harish Rao: అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా?:హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్ర జిన్నింగ్, మిల్లులు పత్తి కొనుగోలు నిలిపివేయడంపై హరీశ్ రావు (Cotton Purchase) సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయం అన్నారు.

ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రులేరి?

పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయ లోపంతో పత్తి రైతులు చిత్తవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని దుయ్యబట్టారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఏమిటి? మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలని ప్రస్నించారు.

రైతులను పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ప్రచారమా?:

పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా? తేమ శాతం సడలింపు, కొత్త నిబంధనల విషయమై ఢిల్లీకి వెళ్లి సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసే తీరిక లేదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి తేమ శాతం సహా ఇతర నిబంధనల విషయంలో కేంద్రంపై, ఒత్తిడి తేవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed