Harish Rao: దావోస్‌‌పై ఇప్పుడు ఎందుకు దావతు? సీఎం ప్రెస్‌మీట్‌పై హరీశ్‌రావు కౌంటర్

by Ramesh N |
Harish Rao: దావోస్‌‌పై ఇప్పుడు ఎందుకు దావతు? సీఎం ప్రెస్‌మీట్‌పై హరీశ్‌రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడో అయిపోయిన (Davos) దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు.. అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాల ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీస్ ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు.. అంటూ విమర్శించారు. దావోస్‌లో జరిగే ఎంఓయూలు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందే.. అని ఆర్థిక మంత్రి భట్టి అంటే, మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారు. (Bhatti Vikramarka) భట్టి చెప్పింది నిజమా? మీ మాటలు నిజమా? రేవంత్ రెడ్డి గారూ.. అంటూ ప్రశ్నించారు.

పొంతన లేకుండా చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించిందని, అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందని ఆరోపించారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా? అని నిలదీశారు. ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నవు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నవు.. మండిపడ్డారు.

సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు.. అంటూ విమర్శించారు. జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నవు.. అని పేర్కొన్నారు. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టీ మీ ప్రచారం వినాలా? రైతుల అప్పులు ముఖ్యమా..? దావోస్ డప్పులు ముఖ్యమా..? అని ప్రశ్నించారు. మీ సెల్ఫ్ డబ్బా కు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లిందని, ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది.. నీ మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయిందన్నారు. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని విమర్శించారు.

Next Story