Harish Rao: ‘అక్కడా అబద్ధాలేనా..? హామీలపై బహిరంగ చర్చకు సిద్ధమా?’.. సీఎంకు హరీశ్ సవాల్

by karthikeya |
Harish Rao: ‘అక్కడా అబద్ధాలేనా..? హామీలపై బహిరంగ చర్చకు సిద్ధమా?’.. సీఎంకు హరీశ్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చెప్పడాన్ని బీఆర్ఎస్ సీనియర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీల ఎక్కడ అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై చర్చ పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని, మరి సీఎం సిద్ధంగా ఉన్నారా..? అని సవాల్ విసిరారు. ఈ రోజు (ఆదివారం) తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. మహారాష్ట్రలోనూ రేవంత్ తన అబద్ధాలు కొనసాగిస్తున్నారని, ఏఐసీసీ పూర్తిగా గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

అనంతరం 6 గ్యారెంటీల అమలు గురించి వివరిస్తూ.. ‘‘6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2,500 ఇస్తామన్నారు. కానీ ఇది ఇప్పటివరకు అమలు కాలేదు. అలాంటప్పుడు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పినట్లే కదా.? రాష్ట్రంలో ప్రతి మహిళకి తమ ప్రభుత్వం రూ.27,500 బాకీ ఉన్నామని చెబితే అప్పుడు రేవంత్ రెడ్డి నిజం చెప్పినట్లు అవుతుంది.

రెండోది రైతు భరోసా గ్యారెంటీ. దీని ప్రకారం ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. కానీ అది ఇవ్వకపోగా గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కూడా ఎగ్గొట్టామని మహారాష్ట్ర ప్రజలకు రేవంత్ చెబితే అది నిజం చెప్పినట్లు అవుతుంది.

మూడోది రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. మొన్న బడ్జెట్‌లో కూడా దీనికి నిధులు కేటాయించారు. కానీ 8 నెలలైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వరి పంటకు ఎమ్మెస్పీపై రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇదే విషయం మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి చెప్పారు. మరి తెలంగాణ రైతులే చెప్పాలి. వారికి బోనస్ అందిందో లేదో.ఇక ఇప్పుడు సన్నరకాలకే ఇస్తామని చెప్పామంటూ మెలిక పెడుతున్నారు.

నాలుగవది హామీ ఇందిరమ్మ ఇళ్లు. ఈ 11 నెలల్లో ఉన్న ఇళ్లను కూలగొట్టడం తప్ప ఒక్క ఇళ్లైనా కట్టావా..? మరి ఈ విషయం మహరాష్ట్రాలో చెబితే అప్పుడు నువ్వు నిజం చెప్పినట్లు అయ్యేది.

ఐదో పథకం.. యువ వికాసం. మరి ఈ పథకం ప్రకారం.. ఒక్కరికన్నా రూ.5 లక్షల భరోసా కార్డ్ ఇచ్చావా..? నడుస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా బంద్ పెట్టి విద్యార్థులను రోడ్డు మీదికి తెచ్చినవ్. కానీ ఇది కూడా అక్కడ చెప్పలేదు. ఆరవ హామీ కింద వృద్ధులకు, వితంతువులకు రూ.4 వేల రూపాయలు ఇస్తానని చెప్పావ్. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రూ.2 వేలు కూడా రెండు నెలలు ఎగబెట్టినవ్. మొత్తంగా ఈ పథకం కింద ఇప్పటివరకు 41 లక్షల మంది పెన్షన్ దారులకు ఒక్కొక్కరికీ రూ.26 వేల చొప్పున బాకీ పడింది. ఇదే విషయం మహారాష్ట్రలో చెబితే నువ్వు నిజం చేబితే నిన్ను ప్రజలు నమ్మేవాళ్లు’’ అంటూ రేవంత్ రెడ్దిపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.

రైతు భరోసా, వడ్లకు బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, ఇలా అన్నీ బోగస్ పథకాలేనని, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి ఆయన అక్కడ చెప్పి ఉంటే నిజంగానే నిజాలు చెప్పడానికి మహారాష్ట్ర వెళ్లావని నమ్మేవాళ్లమని సెటైర్ వేశారు. ఇలా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్నీ చేశామంటూ అబద్ధాలు చెప్పడం సరి కాదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed