అదునుచూసి దెబ్బకొట్టిన గుత్తా.. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలపై కుండబద్దలు

by Disha Web Desk 2 |
అదునుచూసి దెబ్బకొట్టిన గుత్తా.. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలపై కుండబద్దలు
X

దిశ, నల్లగొండ బ్యూరో: పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే నేతలు పార్టీని వీడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పార్టీ ఘోరంగా దెబ్బ తినడానికి ఆ జిల్లాలో ఉన్న మంత్రులే కారణమని కీలక ఆరోపణలు చేశారు. అహంకారపురితంగా మాట్లాడడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ పరిస్థితి సమీక్షించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. బీఆర్ఎస్‌లో అంతర్గత సమస్యలు ఉన్నాయని అన్నారు. శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. ఒకనాడు జేబులో రూ.500 కూడా లేని వ్యక్తులు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఉద్యమకారుల ముసుగులో కోట్ల రూపాయల సంపాదించారని విమర్శించారు. జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు తనకు కేసీఆర్‌ను కలవకుండా చేస్తున్నారని అన్నారు. నాడు తనను 16 సార్లు కలిసి రిక్వెస్ట్ చేస్తే, మంత్రి మండలిలోకి తీసుకుంటానని హామీ ఇచ్చిన తర్వాతనే పార్టీ మారానని గుత్తా కుండబద్దలు కొట్టారు. కుమారుడు అమిత్ పోటీ చేయడానికి ఆసక్తి చూపిన సమయంలో జిల్లాలో కొంతమంది నాయకులు సహకారం ఇవ్వలేదని అన్నారు. అందుకరే పోటీ నుంచి తప్పుకున్నాడని చెప్పారు. అమిత్ రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కోర్టు అంశాలను, న్యాయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు ఉంటాయన్నారు.

Next Story

Most Viewed