Gruha Jyothi : గృహజ్యోతి అమలుకు రూ. 2,418 కోట్లు

by Rajesh |
Gruha Jyothi : గృహజ్యోతి అమలుకు రూ. 2,418 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలుకు 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రూ.2,418 కోట్లను కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలుచేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఇంధన శాఖ ఉత్తర్వులు జారీచేసిందన్నారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. గృహజ్యోతి పథకానికి ఈనెల 22వ తేదీ నాటికి 46 లక్షల 19 వేల 236 కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయన్నారు.

గృహహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించేవారికి జీరో కరెంట్ బిల్లులు అందిస్తున్నట్లు తెలిపారు. గృహజ్యోతి జీరో బిల్లులకు సంబంధించి గత ప్రభుత్వంలా తాము చేయడంలేదని, డిస్కంలకు నెలనెలా ప్రభుత్వం చెల్లిస్తోందని భట్టి తెలిపారు. మార్చి 24న రూ.98.8 కోట్లు, ఏప్రిల్ 24న 116.16 కోట్లు, మే 24న రూ.118.16 కోట్లు, జూన్ 24న రూ.154.65 కోట్లు. జులై 24న రూ.153.17 కోట్లు.. మొత్తంగా రూ.640.94 కోట్లు అందించినట్లు చెప్పారు. గృహజ్యోతి పథకం రాష్ట్ర వ్యాప్తంగా పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.

ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్ నిధులపై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం శాసనసభలో పెట్టిన చర్చకు ప్రతిపక్షాల నుంచి ఆశించిన మేరకు రావాల్సినంత మద్దతు రాలేదనిపిస్తోందని ఆయన చురకలంటించారు. బీఆర్ఎస్ కు, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. విభజన చట్టం వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమని, వెనుకబడిన తెలంగాణను అభివృద్ధి చేయాలని ఈ చట్టాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారని భట్టి గుర్తుచేశారు. విభజన చట్టం ద్వారా హక్కుగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

పక్క రాష్ట్రానికి నిధులు ఇచ్చినందుకు తాము బాధపడటం లేదని, కానీ తెలంగాణకు నిధులు ఇవ్వనందుకు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్.., కేంద్ర వివక్షతపై గట్టిగా వాదిస్తుందని ఆశించామని, కానీ వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తెలుస్తోందని ఎద్దేవాచేశారు. బీజేపీకి కోపం వస్తుందన్న భయంతో సభలో తీర్మానం చేయాల్సిన అంశం గురించి కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగతావి మాట్లాడారని చురకలంటించాచరు. కేటీఆర్ సీనియర్ శాసనసభ్యుడని, మంత్రిగా పనిచేశారని, అలాంటిది.. చర్చ జరిగే అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సభా నాయకుడికి అనుభవం లేదంటూ అవహేళన చేయడం సరికాదని విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో చర్చకు పెట్టిన తర్వాత అంశాన్ని చెప్పేవారని, కానీ తాము చర్చ పెట్టడానికి ముందే అంశం గురించి చెప్పామని భట్టి తెలిపారు. విభజన చట్టం ద్వారా హక్కుగా రావాల్సిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐఏఎం, నవోదయ స్కూల్స్, వరంగల్- హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, మూసీ ప్రక్షాళన-అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ, త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణాలకు కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని కోరిన బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడం బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన అంశం గురించి కేంద్రాన్ని అడగడానికి అన్ని పక్షాలు ప్రభుత్వంతో కలిసి వచ్చి తీర్మానాన్ని ఏకీభవించాలని ఆయన కోరారు. ఇందులో ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు.

ఇకపోతే కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్.., బీజేపీతో కలవడం ఏంటని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండి బీజేపీతో కలిసింది బీఆర్ఎస్ అని విరుచుకుపడ్డారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్న అంశానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. మొన్న హెచ్ఐసీసీలో జరిగిన బొగ్గు ఆక్షన్ కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వేయడానికి కారకులే బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఎంఎంబీఆర్ చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం లేకుండా ఆనాడు యూపీఏ ప్రభుత్వం విభజన చట్టం రూపొందించిందని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రెండు లక్షల ఎకరాలు ఉన్న ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేస్తే పదేండ్ల అధికారంలో ఉండి పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తామని, అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పిన బీఆర్ఎస్.. పదేళ్లలో ఒక్కసారైనా ఈ అంశంపై అఖిలపక్షాన్ని తీసుకువెళ్లారా? అని నిలదీశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును బ్రహ్మాండంగా కట్టిందని కేటీఆర్ చెప్పడం అర్థరహితమని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. అంతకుముందే ఉన్న ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు రూ.1450 కోట్లతో పూర్తయ్యేవని, కానీ రీడిజైన్ పేరిట 20 వేల కోట్ల రూపాయలకు పెంచి, రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి, ఒక ఎకరాకు కూడా బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ రూ.8 వేల కోట్లు దుర్వినియోగం కాకూడదని భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష పెట్టి ఈ ప్రాజెక్టును వైరా ప్రాజెక్టుకు ఎన్ఎస్‌పీఎల్ కెనాల్ ద్వారా కేవలం రూ.70 కోట్లతో లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఇవ్వనందుకు సీఎం, కేబినెట్ మంత్రులందరూ సచ్చేదాకా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. హెల్తీ ప్రతిపక్షంగా ఉండాలే తప్ప ఇలా ఆలోచించడం మంచిది కాదని భట్టి చురకలంటించారు.

Advertisement

Next Story