ఫోన్ ట్యాపింగ్ లీకులతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

by Shiva |
ఫోన్ ట్యాపింగ్ లీకులతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్షాలను అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసే కుట్ర, ఎత్తుగడలు చేస్తోందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై లీకులతో కాలక్షేపం చేస్తున్నారే తప్పా.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కింది స్థాయి పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు కేసులు పెడుతున్నారని, వారు ఇన్నాళ్లు ఏం చేశారో పై స్థాయి అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రత్యేకించి ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వీటన్నింటి‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని అన్నారు. రేవంత్ రెడ్డి హోం మంత్రిగా ఉండి ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారని, కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ తమకు అనుకూలమైన మీడియా సంస్థలకు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండగానే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు‌ను జైల్లో వేస్తానని బహిరంగంగా చెప్పారని, సీఎం కాగానే దురుద్దేశం‌తో తనకు ఇష్టం లేని అధికారులపై వేధింపులు మొదలు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఆరు రోజుల ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు స్థానిక డీసీపీ, విచారణాధికారి పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ట్యాపింగ్ కేసును ఎన్నికల సంఘం పర్యవేక్షణ కిందకు తేవాలని కోరారు. సీపీ సహా రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పొలీస్ అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరామన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి కేసీఆర్, కేటీఆర్‌లకు జైలు శిక్ష తప్పదని మాట్లాడటాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. రాజ్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈసీ ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed