Government whip: కేటీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు

by Gantepaka Srikanth |
Government whip: కేటీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) పేర్కొన్నారు. గురువారం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కులగణన విషయంలో తమకు కేటీఆర్(KTR) నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టేంత సీన్ కేటీఆర్‌కు లేదని విమర్శించారు. కులగణన చేయాలని కోరిందే రాహుల్ గాంధీ(Rahul Gandhi) అని గుర్తుచేశారు. జనాభాలో ఎవరి వాటా ఎంతో తేల్చి.. అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించాలని రాహుల్ స్పష్టం చేశారని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీఆర్ఎస్‌(BRS)కు కులగణన పైన అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడిగా కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నాడు.. మూడు పదవులు వాళ్లకేనా..? అని అడిగారు. ఈ మూడు పదవులకు ముగ్గురు రాజీనామాలు చేసి.. బీసీలకు కేటాయించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


తమ పార్టీ బీసీ వ్యక్తి(మహేశ్ కుమార్ గౌడ్)కి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిందని తెలిపారు. బీసీలకు మంత్రివర్గంలో మరింత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించామని.. బీసీలపై తమకున్న చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో చివరకు మిగిలేది ఆ నలుగురే(కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత) అని జోస్యం చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చామని చెప్పారు. గల్ఫ్ కార్మికులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ‘బాబు.. చిట్టి’ అని తాము కూడా కేటీఆర్‌ను పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అసలు చంద్రబాబు లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడో కేటీఆర్ గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ మెప్పు కోసమే.. కల్వకుంట్ల తారక రామారావు అనే పేరును కేసీఆర్ పెట్టారని అన్నారు. రాహుల్ గాంధీని కాకా పట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వివాదం చేయొద్దని సూచించారు. అంత ప్రేమ ఉంటే పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అరిగిపోయిన రికార్డులను జనం వినడం మానేశారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed