తొలిసారి తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు.. సీఎం రేవంత్‌కు వెంకయ్య ప్రశంసలు

by Ramesh N |   ( Updated:2024-07-16 11:19:37.0  )
తొలిసారి తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు.. సీఎం రేవంత్‌కు వెంకయ్య ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని తాను ఎప్పటి నుంచో సూచిస్తూనే ఉన్నానని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని వివరించారు.

ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story