మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్

by karthikeya |
మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పాలసీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నది. దీనిలో భాగంగానే మత్స్సశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ నేతృత్వంలో ఆఫీసర్ల బృందం బెంగళూరు, మైసూర్‌లో పర్యటించేందుకు సోమవారం వెళ్లనున్నది. మూడురోజులపాటు ఈ టీమ్ మత్స్యశాఖ ఆఫీసర్లు, శాస్త్రవేత్తలు, మత్స్యకారులు, రీసెర్చ్ యూనిట్ల అధికారులతో చర్చించనున్నారు. బెంగళూరు, మైసూర్‌లో చెరువుల్లోని చేపల ఉత్పత్తిని పరిశీలించనున్నారు. అక్కడి సూపర్‌వైజర్లను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అక్కడి ఆఫీసర్లు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో పాల్గొననున్నారు. ఈ వివరాలన్నింటినీ రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ టూర్‌లో చేపకంతో పాటు విక్రయాల ఔట్‌లెట్‌లనూ పరిశీలించనున్నారు. చేపల విక్రయాల ధరలు, మార్కెట్ సీజన్, లాభాలు, నష్టాలు వంటి అంశాలను కూడా తెలుసుకోనున్నారు.

అదాయం సమకుర్చుకోవడం ఎలా..?

ప్రస్తుతం మత్స్యశాఖ ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నష్టాలు చవిచూస్తున్నది. దీంతో సర్కారుపై ఆధారపడకుండా బడ్జెట్‌ను సమకూర్చుకోవాలని మత్స్యశాఖ ప్రయత్నిస్తున్నది. కర్ణాటకలో మత్స్యశాఖ ప్రభుత్వ బడ్జెట్‌తో సంబంధం లేకుండానే లాభాల బాటలో కొనసాగుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో అక్కడికి పర్యటనకు వెళ్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తామని, అన్ని స్టేట్‌ల పరిస్థితులను సీఎం రేవంత్‌రెడ్డికి రిపోర్టు రూపంలో అందజేస్తామని వివరించారు. ఆ తర్వాత ఆదాయం సమకూర్చుకునేందుకు బెస్ట్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని వెల్లడించారు.

అన్ని చెరువుల్లో చేపల ఉత్పత్తి పెంచుతాం: మెట్టు సాయికుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల చేరువులు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 6 వేల చెరువుల్లో మాత్రమే చేపల ఉత్పత్తి జరుగుతోంది. గత సర్కారు నిర్లక్ష్యం కారణంగా 6 వేల చెరువులకు మ్యాపింగ్ లేదు. అన్ని చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించనున్నది. వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందజేస్తాం. ఇతర రాష్ట్రాల టూర్ తర్వాత మత్స్యకారుల సొసైటీలకు అవగాహన కల్పిస్తాం. గత పదేండ్లలో చేపల పెంపకం పేరుతో బీఆర్ఎస్ లీడర్లు కోట్లాది రూపాయలు లూటీ చేశారు. వాటన్నింటినీ లెక్కలతో సహా బయటపెడతాం.

Advertisement

Next Story

Most Viewed