ఉద్యోగాల భర్తీపై సర్కారు ప్రకటనలు.. ఆ లెక్కలపై నిరుద్యోగుల ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-02 02:40:19.0  )
ఉద్యోగాల భర్తీపై సర్కారు ప్రకటనలు.. ఆ లెక్కలపై నిరుద్యోగుల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో నియామకాలు ఒక ప్రధానమైన నినాదం. రాష్ట్రంగా ఏర్పడితే కొలువులు వస్తాయన్న ఉద్దేశంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆకాంక్షించారు. కానీ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నిరాశలో ఉన్నారు. దీంతో ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ. 3,016 చొప్పున ఇవ్వనున్నట్లు రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించింది. గతేడాది మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనలో రాష్ట్రం ఏర్పడింది మొదలు 2022 వరకు 1,12,307 కొత్త పోస్టుల్ని సృష్టించినట్లు తెలిపారు. మొత్తం 1,56,254 పోస్టుల్ని భర్తీ చేయాలని గుర్తించామని, ఇందులో ఇప్పటికే 1,33,942 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు స్పష్టత ఇచ్చారు. అయితే, ప్రభుత్వం చెప్తున్న లెక్కలపై నిరుద్యోగులు పెదవి విరిచారు. ఆ స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిశ్వాల్ నేతృత్వంలో ఏర్పడిన వేతన సవరణ కమిషన్ లెక్కల ప్రకారం 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ విపక్షాలు వ్యాఖ్యానించాయి.

నోటిఫికేషన్లు.. అంతా మాయే

గతేడాది మార్చి 23న ఒకే రోజున 30,453 పోస్టుల భర్తీ కోసం పది నోటిఫికేషన్‌లు వేర్వేరు శాఖల తరఫున విడుదలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 62 వేలకు పైగా పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 31 నాటికి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కానీ వేర్వేరు కారణాలతో ఏడాదికి పైగా ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. పైగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పలు ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎంక్వయిరీ చేస్తూ ఉన్నది. దీంతో మళ్లీ ఎంట్రన్స్, మెయిన్ పరీక్షల నిర్వహణ ప్రాసెస్‌లో ఉన్నది. మరోవైపు ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చినా రెగ్యులరైజ్ చేయడంలేదంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మెకు దిగారు. సర్వీసు నుంచి తొలగిస్తామని సర్కారు హెచ్చరించింది. అయినా వెనుదిరగలేదు. చివరకు ప్రభుత్వమే చర్చలు జరిపి తిరిగి విధుల్లో చేర్చుకున్నది. విద్యుత్ ఆర్టిజన్లకు హామీ ఇచ్చి సమ్మె చేపట్టకుండా నివారించింది.

ఉద్యోగుల్లో పెరుగుతున్న వ్యతిరేకత

ఉద్యోగుల్లోనూ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతున్నది. సకాలంలో జీతాలు పడడంలేదని అసంతృప్తితో ఉన్నారు. సర్కారు వైఖరి కారణంగా ఈఎంఐలు టైమ్‌కు కట్టలేకపోతున్నామని, సిబిల్ స్కోరుమీద ప్రభావం పడి కొత్తగా అప్పులు పుట్టడంలేదన్న ఆవేదనతో ఉన్నారు. ధనిక రాష్ట్రమే అయినా జీతాలకు దిక్కు లేదనే స్వరం వినిపిస్తున్నది. డీఏ (కరువుభత్యం) విషయంలోనూ అదే రకమైన అసంతృప్తి ఉన్నది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా బదిలీలు, పదోన్నతులు, స్పౌజ్ టాన్సఫర్లు, జీవో 317 చిక్కులు తదితర కారణాలతో ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పరిపాలనలో సంస్కరణలు తెచ్చామని సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నా అటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో, ఇటు నిరుద్యోగులు, విద్యార్థుల్లో ప్రభుత్వానికి ప్రతికూల ప్రభావం తప్పడంలేదు.

Also Read: సొంత నియోజకవర్గంలో మంత్రి సబితకు ఎదురుగాలి.. ఈసారి గెలుపు కష్టమేనా?

Advertisement

Next Story

Most Viewed