తెలంగాణ మహిళలకు శుభవార్త.. 2 చీరలపై డిప్యూటీ CM కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
తెలంగాణ మహిళలకు శుభవార్త.. 2 చీరలపై డిప్యూటీ CM కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్‌(Budget 2025-2026)పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇది పేదల బడ్జెట్ అని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని చెప్పారు. విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచినట్లు తెలిపారు. ఎకరానికి రైతు భరోసా రూ.12 వేలు, రైతుకూలీలకు ఇందిరమ్మ రైతుభరోసా కింద రూ.12 వేలు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ పెంచేందుకు సబ్సిడీలతో పాటు ఫ్యూచర్ సిటీలో గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 57 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు.

త్వరలో గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు(Ambedkar Knowledge Centers) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు రూ.4 లక్షల ఆర్థికసాయం చేయబోతున్నట్లు చెప్పారు. ఈ నాలెడ్జ్ సెంటర్లలో గ్రూపు-1, గ్రూపు-2 అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్(Free Coaching) ఇవ్వబోతున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద రూ.20 వేల కోట్ల రుణాలు, 214 మహిళా క్యాంటీన్లు ప్రారంభించినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.

రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలల్లో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అంబేద్కర్‌ సూచనలను అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో విధ్వంస పాలన సాగిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. అవన్నీ చక్కబెడుతూ పాలన కొనసాగిస్తున్నామని అన్నారు.

Next Story

Most Viewed