‘దిశ’ చేతికి జాబితా.. మొత్తం ఉద్యోగం కోల్పోయే కార్మికులు ఎంతమంది అంటే?

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-16 02:41:47.0  )
‘దిశ’ చేతికి జాబితా.. మొత్తం ఉద్యోగం కోల్పోయే కార్మికులు ఎంతమంది అంటే?
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మున్సిపాలిటీల్లో విలీనం చేస్తామంటే పంచాయితీ కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ వేతనాలు పెరిగి, కుటుంబానికి కాస్త ఆసరా దొరుకుతుందని భావించిన వారికి.. విలీనమయ్యాక ప్రస్తుతం ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందోనన్న ఆందోళన నెలకొంది. తమ బతుకులు రోడ్ల పాలవడంతో లబోదిబోమంటూ విలపిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు లోపల, వెలుపల ఇటీవల సమీప మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.

జీవో 51 ఎఫెక్ట్..?

బీఆర్ఎస్ సర్కార్ 2019లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా వాటిల్లింది. జీవో 51 లోని మార్గదర్శకాల ప్రకారం 500 మంది జనాభకు ఒకరు చొప్పున మల్టీ పర్పస్ వర్కర్ ను నియమించాలని గత సర్కార్ విధానాన్ని తెచ్చింది. ఈ జీవో ప్రకారం ఇప్పటికే గ్రామ పంచాయితీల్లో అదనపు సిబ్బందిని తొలగించే పనిలో పంచాయతీ రాజ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇదే విధానం ద్వారా మున్సిపాలిటీల్లోనూ మల్టీ పర్పస్ వర్కర్స్ (ఎంపీడబ్ల్యూఎస్ )ను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 సంవత్సరం తర్వాత విధుల్లో చేరిన సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో మేడ్చల్ జిల్లా నుంచి ఇటీవల విలీనమైన 28 గ్రామాల నుంచి దాదాపు 350 మంది కార్మికులు తమ ఉద్యోగాలను కొల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఉద్యోగం ఉంటుందా...?

మున్సిపాలిటీల్లో విలీనం తో తమ బతుకులు కాస్త బాగుపడుతాయనకున్న నిరుపేదలైన కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. మున్సిపాలిటీలలో విలీనం తర్వాత కార్మికుల వేతనాలు పెరగకపోగా, రెండు నెలలుగా జీతాలు నిలిపివేశారు. దీంతో 28 విలీన గ్రామాలు ఇటు మున్సిపల్ , అటు పంచాయితీ రాజ్ అధికారుల చుట్టూ జీతాల కోసం చక్కర్లు కొడుతున్నారు. దీనికి తోడు ఉద్యోగం ఉంటుందో .. లేదోనన్న ఆందోళన కార్మికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు గ్రామ పంచాయితీల్లో ఏళ్ల తరబడి చాకరీ చేస్తూనే ఉన్నారు. అయినా మున్సిపల్ అధికారులు నెలనెలా వేతనాలు చెల్లించేందుకు వారిపై కనీకరం చూపకపోవడం శోచనీయం. వేతనాలు ఇవ్వకున్నా.. సమగ్ర కుటుంబ సర్వే చేయిస్తున్నారని పలువురు కార్మికులు వాపోతున్నారు. ఈ సర్వే ముగిసిన తర్వాత తమను ఉద్యోగాల నుంచి తీసేస్తారని ప్రచారం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సర్వే సైతం నిబద్దతతో చేయలేకపోతున్నామని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు.

తొలగింపు ఇలా...

నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో కీసర మండలంలోని 10 గ్రామాలను విలీనం చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఆ 10 విలీన గ్రామాల్లో 184 మంది మల్టీ పర్పస్ వర్కర్స్ కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే జీవో 51 ప్రకారం నిర్ణయం తీసుకుంటే 72 మంది కార్మికులు మాత్రమే విధుల్లో ఉంటారు. మిగితా 112 మంది కార్మికులు తమ ఉద్యోగాలను కొల్పోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు జాబితాను జిల్లా అధికారులు రూపొందించారు. ఆ జాబితా ‘దిశ’ చేతికి చిక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.




Advertisement

Next Story

Most Viewed