పెండింగ్ డీఏలు ఇవ్వండి.. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రిక్వెస్ట్

by Bhoopathi Nagaiah |
పెండింగ్ డీఏలు ఇవ్వండి.. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల‌ను ఉద్యోగుల‌కు ప్రభుత్వం చెల్లించేలా చూడాల‌ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి కోరారు. 26న జ‌రిగే కేబినేట్ స‌మావేశంలో డీఏలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాల‌న్నారు. జీఓ నం.317తో రాష్ట్రంలో ఇబ్బందులు ప‌డుతున్న ఉద్యోగులంద‌రికీ స‌త్వర‌మే న్యాయం చేసే విధంగా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌లు అందే విధంగా నూత‌న హెల్త్ స్కీంను అమ‌లు చేయాల‌న్నారు. ఉద్యోగుల జేఏసీ కమిటీ స‌మావేశం నాంప‌ల్లిలోని డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ కార్యాల‌యంలో సోమవారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప్రధానంగా ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన ఐదు డీఏ బ‌కాయిలు, జీఓ నం.317పై కేబినెట్ స‌బ్ క‌మిటీ నివేదిక‌, నూత‌న‌ హెల్త్ స్కీం అమ‌లు, సీపీఎస్ ర‌ద్దు అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయ‌బ‌ద్దమైన స‌మ‌స్యల‌ను ప్రభుత్వం వెంట‌నే ప‌రిష్కరించాల‌న్నారు. జీఓ నం.317పై స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేయ‌డ‌ంతో పాటు నివేదిక‌ను సైతం స‌మ‌ర్పించ‌డం ప‌ట్ల ధ‌న్యవాదాలు తెలిపారు. న‌గ‌దు ర‌హిత హెల్త్ స్కీంను అమ‌లు చేసి గ‌తంలో ఉద్యోగులు ప‌డే ఇబ్బందులు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. స‌మావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయ‌కులు కె.రామ‌కృష్ణ, డా.జి.నిర్మల‌, ద‌ర్శన్‌గౌడ్‌, ర‌వికుమార్‌, హన్మంతరావు, ఎస్‌.రాములు, వివేక్‌, శ‌శిధ‌ర్‌రెడ్డి, వెంక‌టేష్‌, స‌క్కుబాయి, ర‌మేష్ పాక‌, స‌త్యనారాయ‌ణ‌, రాబ‌ర్ట్ బ్రూస్‌, ఎండీ మ‌సూద్ అహ్మద్‌, రామ‌రాజు, రామ‌కృష్ణ, చంద్రశేఖ‌ర్‌గౌడ్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed