సిటీలో గజ్వేల్ కుక్కలు! బాలుడిని కాటు వేసినవి అవేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-24 03:10:02.0  )
సిటీలో గజ్వేల్ కుక్కలు! బాలుడిని కాటు వేసినవి అవేనా?
X

అంబర్‌పేటలో బాలుడిని కాటేసిన కుక్కలు గజ్వేల్ ప్రాంతానివిగా అనుమానం వ్యక్తమవుతున్నది. పాలకుల మౌఖిక ఆదేశాలతో గతేడాది జూలైలో ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ ఉన్న ప్రాంతం నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వందలాది కుక్కలను పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి పట్టుకున్న ప్రాంతంలోనే వదిలేయాలి. కానీ వాటిని సిటీలో వదిలేసినట్లు తెలిసింది. అందుకే నగరంలో కుక్కల బెడద పెరిగి..అవి ప్రజలపై దాడులు చేస్తున్నట్లు నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.

దిశ, సిటీ బ్యూరో: గజ్వేల్‌లోని సీఎం ఫామ్ హౌజ్ ఏరియాలో కుక్కల బెడదను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది నిబంధనలను తుంగలో తొక్కారు. అక్కడి నుంచి కుక్కలను పట్టుకొచ్చి సిటీలో వదిలేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పాలకుల ఆదేశాలతో జీహెచ్ఎంసీకి చెందిన వెటర్నరీ సిబ్బంది గతేడాది జులైలో గజ్వేల్‌లోని సీఎం ఫామ్ హౌజ్ పరిసర ప్రాంతాలు, చుట్టు పక్కనున్న గ్రామాల్లో మూడు రోజుల పాటు వేట కొనసాగించారు.

అయితే మూగజీవాల పరిరక్షణ, సంక్షేమ బోర్టు మార్గదర్శకాల ప్రకారం పట్టుకున్న కుక్కలకు యాంటీ రెబీస్ వ్యాక్సినేషన్, సంతానోత్పత్తి లేకుండా స్టెరిలైజేషన్ చేయాలి. ఏ ప్రాంతంలో పట్టుకున్నారో ఆ ప్రాంతంలోనే తిరిగి వాటిని వదిలేయాలి. కానీ నాలుగు దఫాలుగా సుమారు 200 కుక్కలను తీసుకొచ్చి సిటీలో వదిలినట్లు తెలిసింది. హాఫీజ్ పేట, శేరిలింగంపల్లి, కొండాపూర్, పటాన్ చెరుతో పాటు సికింద్రాబాద్‌ జోన్‌లోని అంబర్‌పేట, మరికొన్ని సర్కిళ్లలో విడిచి పెట్టినట్లు సమాచారం. సికింద్రాబాద్ జోన్‌లో సుమారు 86 కుక్కలను వదిలి పెట్టగా, వాటిలో ఎక్కువగా అంబర్‌పేట సర్కిల్‌లోనే విడిచి పెట్టినట్లు తెలిసింది.

బాలుడిని కాటువేసినవి ఆ కుక్కలేనా?

అంబర్‌పేటలో బాలుడిపై దాడి చేసిన కుక్కల్లో ఎక్కువ గజ్వేల్ ప్రాంతానికి చెందినవేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్‌లోని చల్లటి గ్రామీణ వాతారణంలో అవి పెరిగాయి. అక్కడి నుంచి సిటీకి తీసుకురావడంతో ఇక్కడి రణగోణ ధ్వనులు, వాతావరణ మార్పుల వల్ల అవి ఇరిటేట్ అయి అటాక్ చేశాయా అనే డౌట్ సైతం ఉన్నది. సీఎం ఫామ్ హౌజ్ ఉన్న ఏరియాలో కుక్కల బెడదను నివారించేందుకు వాటిని అక్కడి నుంచి తీసుకొచ్చి సిటీలో వదిలేయడాన్ని మహానగర వాసులు తప్పుబడుతున్నారు.

అంబర్ పేటలో 59 స్ట్రీట్ డాగ్స్ గుర్తింపు

నాలుగేళ్ల బాలుడిపై దాడి జరిగిన ప్రాంతంలో సుమారు 59 వీధి కుక్కలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇప్పటికే 35 కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్‌కు తరలించినట్లు తెలిసింది. మరో 24 కుక్కలను పట్టుకోవాల్సి ఉన్నది.

Advertisement

Next Story