Gadala Srinivas: ‘గడల’ వీఆర్ఎస్‌కు ఓకే.. ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం

by Shiva |
Gadala Srinivas: ‘గడల’ వీఆర్ఎస్‌కు ఓకే.. ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు వీఆర్ఎస్ (స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) ను ప్రభుత్వం ఆమోదించింది. దాదాపు ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గడల 2018 మే 28న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వచ్చిన కొద్ది రోజుల్లోనే 2023 డిసెంబర్ 20న ఆయనను పోస్టు నుంచి తప్పించి, సీనియారిటీ ప్రకారం మరో అధికారిని నియమించింది.

కానీ, గడల శ్రీనివాసరావు కు ఇతర పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆర్ఎస్ కు అప్లయ్ చేశారు. ఆ ఫైల్ ను కొద్ది రోజులపాటు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. దీంతో మరోసారి ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత గత నెల 27న ఆయనకు మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా నియమించింది. కానీ ఆయన లాంగ్ లీవ్ లో ఉండటంతో జాయిన్ అవ్వలేదు. ఇటీవల ఆయన స్వయంగా హెల్త్ సెక్రటరీని కలిసి తన వీఆర్ఎస్ ను ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. ఫైల్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన సెక్రటరీ, ప్రభుత్వం నుంచి ఆమోదన తెలుపుతూ ఉత్తర్వులిచ్చారు.ః

కొవిడ్‌లో క్రీయాశీలకంగా వర్క్

గడల డీహెచ్(ఇన్ చార్జి)గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2019లో మన స్టేట్ లో డెంగ్యూ సర్జ్ వచ్చింది. కేసుల నమోదు, తీవ్రతతో దేశంలోనే తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ సమయంలో ఆయన క్రియాశీలకంగా వర్క్ చేసి, కొద్ది నెలల్లోనే కంట్రోల్ చేశారని డిపార్ట్ మెంట్ లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఏడాదిలో కొవిడ్ ఎంటరైంది. దీంతో కరోనా నియంత్రణపై పూర్తి బాధ్యతలను గత ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఇతర రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులు మానిటరింగ్ చేసినా, మన దగ్గర మాత్రం డాక్టర్ కే ఇచ్చారు. దీంతో ఆయన శక్తివంచన లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపుతూ పనిచేయించారు. కొవిడ్ జాగ్రత్తలను ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలకూ భరోసా ఇచ్చారు. కరోనాలో స్వయంగా తన తండ్రిని కోల్పోయినా, ఆయన ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు వెనకాడలేదు.

వెంటాడిన వివాదాలు..

కొవిడ్ సమయంలో పనిచేసిన విధానం, సమర్థతను పరిశీలించిన అప్పటి సీఎం కేసీఆర్ గడలకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితుల్లో ప్రచారం జరిగింది. దీంతో ఆయన తన సొంత ప్రాంతం కొత్తగూడెంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు తనదైన స్టైల్ లో ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపులు, మోటివేషనల్ ప్రోగ్రామ్స్, జాబ్ మేళా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా వివాదాస్పదమయ్యాయి.

డబ్ల్యూ‌హెచ్‌వో ఆఫర్?

డాక్టర్ గడల శ్రీనివాసరావు డీహెచ్ పోస్టు నుంచి తప్పుకున్న తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయనకు ఓ బిగ్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. తమ సంస్థ తరపున ‘సౌత్ ఈస్ట్ ఏషియన్ హెడ్’ గా బాధ్యతలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధులు కోరారు. కానీ తనకు సొంత రాష్ట్రంలోనే సేవలు అందించడం ఇష్టమని ఆయన సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం. దీంతోపాటు మరో పేరుగాంచిన ప్రైవేట్ ఫార్మా సంస్థ కూడా పెద్ద ఆఫర్ చేసినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed