డబుల్ బెడ్రూం ఇండ్ల నిధులు డైవర్ట్ చేశారు.. కేసీఆర్ సర్కార్ పై కాగ్ అక్షింతలు

by Prasad Jukanti |
డబుల్ బెడ్రూం ఇండ్ల నిధులు డైవర్ట్ చేశారు.. కేసీఆర్ సర్కార్ పై కాగ్ అక్షింతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంపై కాగ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం నిధులను దారి మళ్లించిందని, ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వహణలోనే లోపం ఉందని స్పష్టం చేసింది. పట్టణ, గ్రామీణ పేదవారికి గౌరవప్రదమైన ఇండ్లను అందించేందుకు 100 శాతం రాయితీతో కూడిన రెండు పడకల గదుల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అయితే ఈ పథకంలో లోటుపాట్లు ఉన్నాయని కాగ్ నివేదిక వెల్లడించింది. తీసుకున్న రుణ మొత్తాన్ని కొంత కాలం పాటు నిర్థకంగా డిపాజిట్లలో ఉంచడం, నిధులను ఇతర పథకాలకు, సంస్థలకు దారి మళ్లించినట్లు స్పష్టం చేసింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి సంబంధం లేని ఇతర రుణాలను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది.

కట్టిన ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన:

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ మంజూరు చేసిన 1 లక్ష ఇండ్లకు గాను 48,178 మాత్రమే పూర్తయ్యాయని 6 సంవత్సరాలు గడిచినప్పటికీ (2020-21) నిర్మాణం పూర్తయిన ఇళ్లు కేవలం 48 శాతం మాత్రమే అని పేర్కొంది. పథకం కోసం లబ్దిదారులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని రిపోర్ట్ స్పష్టం చేసింది. పూర్తయిన ఇళ్లలో 96 శాతం (46,442) ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని పేర్కొంది. నిర్మాణం పూర్తయిన ఇండ్లు ఖాళీగా ఉంచడం వల్ల ఇప్పటి వరకు ఖర్చుచేసిన రూ.3,983.68 కోట్లు వృథా అయ్యాయని తెలిపింది. దీంతో నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ అనుకున్న విధంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందించే లక్ష్యం నెరవేరలేదని కాగ్ తన రిపోర్ట్ లో పేర్కొంది.

Advertisement

Next Story