చెక్‘పోస్టు’లకు ఫుల్ క్రేజ్.. రూ.80 లక్షలు డిమాండ్

by Sathputhe Rajesh |
చెక్‘పోస్టు’లకు ఫుల్ క్రేజ్.. రూ.80 లక్షలు డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణాశాఖ చెక్ పోస్టుల్లో పోస్టింగ్ కోసం మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు పోటీ పడుతున్నారు. పోస్టింగ్ ఇప్పించేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగి ఎంవీఐలతో డీల్ కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తామని ఆశచూపుతూ, రేటును ఫిక్స్ చేసినట్టు టాక్. ఏరియాను బట్టి రూ.80 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అడిగినంత మొత్తంలో ముడుపులు ఇచ్చుకునేందుకు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు సైతం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

చెక్ పోస్టును బట్టి రేటు

రాష్ట్రంలో 13 చోట్ల అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్ పోస్టులు ఉన్నాయి. లాంగ్ స్టాండింగ్ కారణంతో అక్కడ పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసి, కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీంతో ఆ స్థానాల్లో పోస్టింగ్ కావాలంటే, తాము ఇప్పిస్తామని కొందరు మధ్యవర్తులు బేరసారాలకు దిగుతున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటును ఫిక్స్ చేసి అడ్వాన్సులు సైతం తీసుకుంటున్నారని సమాచారం. కనిష్ఠంగా రూ.50 లక్షలు నుంచి గరిష్టంగా రూ.80 లక్షలు వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కట్టిన సొమ్ము డ్యూటీలో చేరిన ఐదారు నెలల్లోనే సంపాదించుకోవచ్చనే ధీమాతో చాలా మంది ఎంవీఐలు పోస్టింగ్ కోసం ఎగబడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నెలకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు..

ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రకాల మెటీరియల్స్‌తో వచ్చే ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను అంతరాష్ట్ర సరహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల్లోని అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. అందులో ఏం తరలిస్తున్నారు? వాటికి సరైన బిల్లులు ఉన్నాయా? నిషేధ పదార్థాలు ఏమైన రవాణా చేస్తున్నారా? అని ప్రతి వాహనాన్నీ చెక్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా లోడ్‌తో వచ్చే వాహనాలను సీజ్ చేయాలి.

చెక్‘పోస్టు’లకు ఫుల్ క్రేజ్.. రూ.80 లక్షలు డిమాండ్కానీ చాలా కాలంగా ఆయా చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది ముడుపులు తీసుకుని, తూతూ మంత్రంగానే తనిఖీలు చేసి వాహనాలను అనుమతిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఒక్కో అధికారి రోజుకు రూ.లక్షల్లో వెనుకేసుకుంటున్నట్టు రవాణా శాఖ ఎంప్లాయీస్ మధ్యనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎంవీఐ నెలకు గరిష్టంగా రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు సంపాదిస్తారనే టాక్ వినిపిస్తున్నది. అందులోంచి హోదాను బట్టి హైదరాబాద్‌లో ఉన్న ఆఫీసర్ల‌కు సైతం వాటాలు అందుతాయనే ఆరోపణలు ఉన్నాయి.

చక్రం తిప్పుతున్న ఓ రిటైర్డ్ అధికారి

పోస్టింగ్ దందాలో రవాణా శాఖకు చెందిన ఓ రిటైర్డ్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో పలు ఉద్యోగ సంఘాల లీడర్ల ప్రమేయం ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా కలిసి కొన్ని రోజులుగా చెక్ పోస్టును బట్టి రేటును ఫిక్స్ చేస్తూ.. ఎంవీఐలతో మంతనాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి పొన్నం సీరియస్?

కొందరు మధ్యవర్తులు చెక్ పోస్టుల్లో పోస్టింగ్ ఇప్పిస్తామని చేస్తున్న బేరసారాల విషయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఈ దందా వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీయాలని నిఘా వర్గాలను ఆయన అలర్ట్ చేసినట్టు సమాచారం. పైరవీలకు తావు లేకుండా, బదిలీల జాబితాను తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించినట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed