సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ ఆ నలుగురు డుమ్మా.. అంతుచిక్కని టీ-బీజేపీ కీలక నేతల తీరు..!

by Satheesh |   ( Updated:2023-10-06 01:55:01.0  )
సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ ఆ నలుగురు డుమ్మా.. అంతుచిక్కని టీ-బీజేపీ కీలక నేతల తీరు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పదాధికారుల మీటింగ్‌కు ఆ నలుగురు నేతలు గైర్హాజరయ్యారు. ఇప్పటికే ప్రధాని మోడీ సభలకు డుమ్మా కొట్టిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ ఆఫీస్ బేరర్ల మీటింగ్‌కు హాజరుకాలేదు.

త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు బీజేపీ బ్లూ ప్రింట్ రెడీ చేసేందుకు సిద్ధమవుతోంది. నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఏర్పాటుచేసిన మీటింగుకు వీరు గైర్హాజరు కావడం గమనార్హం. దీనికి తోడు పార్టీ ప్రకటించిన బీజేపీ ఎన్నికల కమిటీలో తిరుగుబాటు నేతలకే చోటు దక్కడం గమనార్హం. ప్రియారిటీ లేకేపోవడంతో అలకబూనిన వారు కీ రోల్ ప్లే చేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

బీజేపీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తిరుగుబాటు నేతలకే ప్రియారిటీ దక్కిందనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీకి జాయింట్ కన్వీనర్‌గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, అజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయశాంతికి అప్పగించారు.

కాగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి మాత్రం ఈ కమిటీలో చోటు దక్కలేదు. ఆయన కొద్ది నెలలుగా పార్టీ యాక్టివిటీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. వీరంతా తాజా మీటింగ్‌కు కూడా రావకపోవడంతో శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఘట్ కేసర్‌లో నిర్వహించనున్న పార్టీ కౌన్సిల్ మీటింగ్‌కు అయినా వెళ్తారా? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

పాలమూరులో నిర్వహించిన సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి శంషాబాద్ విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికి అక్కడి నుంచే రిటర్న్ అయ్యారు. పాలమూరు సభకు వెళ్లలేదు. ఆయనతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి సైతం ఈ సభకు అటెండ్ అవ్వలేదు. కాగా ఈనెల 3వ తేదీన నిజామాబాద్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లలేదు.

ఆ రెండు సభలకు డుమ్మా కొట్టినా పదాధికారుల సమావేశానికి వివేక్ వచ్చారు. వీరంతా పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోనని మీడియాకు వెల్లడించారు. కొద్ది రోజులుగా వీరు పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో అలా జరగకుండా ఉండేందుకే కమిటీల్లో చోటు కల్పించారేమోననే అనుమానం కూడా పలువురు వ్యక్తంచేస్తున్నారు. అయితే వారికి బాధ్యతలు ఇచ్చినా యాక్టివిటీకి దూరంగానే ఉండే అవకాశముందనే చర్చ కూడా జరుగుతోంది.

మళ్లీ వేరు కుంపటి పెట్టుకుంటారనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మార్పు జరగక తప్పదని చెప్పుకుంటున్నారు. రెబల్ లీడర్ల ఇష్యూ ఎప్పటికి కొలిక్కి వస్తుందనేది అంతుచిక్కడం లేదు. ఇన్ని రోజులు ప్రియారిటీ లేదని యాక్టివిటీకి దూరంగా ఉన్న నేతలు ఇప్పటికైనా పార్టీ యాక్టివ్ అవుతారా? లేక ఇలాగే తిరుగుబాటు ధోరణనిని కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed