ఇక చూసుకుందాం.. 2023 ఎన్నికల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను: పొంగులేటి

by GSrikanth |
ఇక చూసుకుందాం.. 2023 ఎన్నికల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను: పొంగులేటి
X

దిశ, ఖమ్మం బ్యూరో: వేటి కోసమైతే తెలంగాణ యువత ఆరాటపడ్డదో.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశారో.. ఎవరికి ఏం వచ్చాయో తెలియదు కానీ.. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం అద్భుతంగా అన్నీ వచ్చాయని, తెలంగాణ బంగారు తెలంగాణ కాకపోయినా.. వారి కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందనీ బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మంలో పొంగులేటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో విషయాల్లో కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి మోసపోయానని.. పార్టీలో చేరిన చాలాకాలం తర్వాత వీరి గురించి తెలిసి జ్ఞానోదయం అయిందనన్నారు. ఎన్నో విషయాలల్లో తనను వాడుకొని నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీలోనే లేనన్నారని.. పార్టీలో లేని వ్యక్తిని ఇప్పుడు ఎట్లా సస్పెండ్ చేస్తారని ధ్వజమెత్తారు.

2014లో కొత్తగూడెంలో ఒక సీటు, 2018లో ఖమ్మంలో ఒక సీటును గెలిచారని.. 2023 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తనలాంటి అసంతృప్త నేతలను ఏకం చేసి తానేంటో చూపిస్తానన్నారు. మొత్తానికి రావణాసురుడి కబంధ హస్తాల నుంచి ఇన్నాళ్లకు విముక్తి కలిగి భద్రాద్రి శ్రీరాముడి పాదాలను తాకే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు. తాను ఎప్పుడు ప్రజల క్షేత్రంలోనే ఉంటానని.. ఇకపై కూడా ప్రజల్లోనే తేల్చుకుంటాన్నారు.

అసంతృప్తితో రగిలిపోతున్నారు..

ప్రజాబలాన్ని ఎవరూ ఆపలేరని చెప్పడానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే నిదర్శనమని.. మీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది చిత్తశుద్ధితో మీరు గెలవాలని చూస్తున్నారో పరిశీలించుకోవాలని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మీ సొంత పార్టీ నాయకులే మీమీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. కొద్దిరోజుల్లో అది స్పష్టంగా చూడబోతున్నారన్నారు. ఎన్నో రోజుల నుంచి సస్పెండ్ చేయని మీరు కొత్తగూడెం సభతో ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని.. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారని.. మీరు సస్పెండ్ చేసిన తీరు సరైందికాదన్నారు.

సమయం ఆసన్నమైంది..

2018 ఏప్రిల్ నెలలో పార్టీలోకి రమ్మన్నది వారేనని.. సరిగ్గా ఏడేళ్ల తరువాత అదే ఏప్రిల్ నెలలో పార్టీ నుంచి పొమ్మంటున్నదీ వారే అన్నారు. పార్టీలో పొంగులేటికి సభ్యత్వమే లేదన్నారని, అసలు సస్పెన్షన్లే బీఆర్ఎస్‌లో ఉండవని అన్న పార్టీ పెద్దలు తనను సస్పెండ్ చేస్తూ ప్రకటన చేయడం విడ్డూరమన్నారు. మూడున్నర నెలలుగా బీఆర్ఎస్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నా.. ఇప్పుడు సస్పెండ్ చేయడం హాస్యస్పాదమన్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాలనే మలుపుతిప్పే ప్రయత్నం చేస్తానని, సమయం ఆసన్నమైందని, అన్ని జిల్లాల్లో తనలాగా బాధపడే అందరినీ కలిసి వారితోనే నిర్ణయం తీసుకుంటాన్నారు. అతికొద్ది రోజుల్లోనే జెండా, ఎజెండా. ప్రకటించబోతున్నాను సిద్ధంగా ఉండండంటూ ఈ సందర్భంగా పొంగులేటి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed