సచివాలయానికి అంబేద్కర్ పేరు తీసేసి.. ఆ పేరు పెట్టుకోండి: మాజీ MP బూర ఫైర్

by Satheesh |
సచివాలయానికి అంబేద్కర్ పేరు తీసేసి.. ఆ పేరు పెట్టుకోండి: మాజీ MP బూర ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రమైతే జీఎస్టీ కలెక్షన్ ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో రూ.5,600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వచ్చిందని, అంత తక్కువ కలెక్షన్ ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులకు అడ్డుపడుతున్నాడని, ముఖ్యమంత్రి కేసీఆర్ సైంధవుడిలా మారారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ఇచ్చిన గిరి వికాస్ నిధులను ముప్పై శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఉంటే తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందేదని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి కూడా సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు తీసి కేసీఆర్ సచివాలయం అనే పేరు పెట్టుకోవాలని ఫైరయ్యారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, లిక్కర్ దందా కూడా ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తోందన్నారు. కృష్ణ గోదావరి నదులు మహారాష్ట్ర నుంచి మొదలవుతాయని, మహారాష్ట్ర అడ్డుపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు బ్రతుకుతాయా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక దేశం.. కేసీఆర్ రాష్ట్రం అయినట్టు భ్రమలో ఉన్న బీఅర్ఎస్ నేతలు బయటకు రావాలని, తెలంగాణ ఇండియాలో భాగమని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed