జమిలీ ఎలక్షన్స్ ఫస్ట్ ఆ రాష్ట్రాల్లో నిర్వహించండి: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు డిమాండ్

by Satheesh |   ( Updated:2023-09-06 14:42:59.0  )
జమిలీ ఎలక్షన్స్ ఫస్ట్ ఆ రాష్ట్రాల్లో నిర్వహించండి: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఒక లేఖ రాసినట్టు తెలిపారు. 2024 ఏప్రిల్-మే నెలలో జరిగే సాధారణ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్రాలకు కూడా ఎన్నికల జరపాలని అన్నారు.

ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మరో డ్రామా ఆడే ప్రయత్నాలు చేస్తున్నారా? అని ఆయన విరుచుకపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారత్ అలాంటి దేశాన్ని ఒకే దేశం - ఒకే పన్ను, ఒకే దేశం- ఒకే రేషన్.. ఇప్పుడు ప్రస్తుతం ఒకే దేశం- ఒకే ఎన్నిక అంటూ మీ నిరంకుశ వ్యవస్థలో మాదిరిగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. మరో తొమ్మిది నెలలలో ఎన్నికలు జరుగుతుండగా.. ఆకస్మాత్తుగా జమిలి ఎన్నికల గురించి హడావిడి చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

మన ప్రజాస్వామ్య ప్రక్రియలలో సంస్కరణల పట్ల నిజాయితీతో ప్రధాని, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల విషయం అట్లా ఉంచితే అంతకన్నా అత్యవసరమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేయడం గురించి బీజేపీ అసలు పట్టించుకోవడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళుతున్న ఫిరాయింపుదారుల పట్ల లోక్ సభ వివిధ రాష్ట్ర అసెంబ్లీల స్పీకర్లు, రాజ్యసభ శాసనమండలి చైర్మన్‌లకు కాలపరిమితి నిర్ణయించి చిత్తశుద్ధిని చాటుకోవాలని గోనెల డిమాండ్ చేశారు.

ప్రతిసారి ఎన్నికల నిర్వహణ ఖర్చు అని చెబుతున్న బీజేపీ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుకున్న భారతదేశం సుమారు 45 లక్షల కోట్ల వరకు ఉందని, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎన్నికల నిర్వహణ భారం అని పేర్కొనడం ప్రజాస్వామ్యం పట్ల మీ నిజాయితీని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా మీ ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం కోల్పోవడంతో ఇటువంటి డ్రామాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మన రాజకీయ వ్యవస్థను పటిష్ట పరచాలి అనుకుంటే ముందుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని కోరుతున్నట్లు ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నట్టు గోనెల తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed