ఎమ్మెల్యేలు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి.. కానీ ఆ పని చేయకండి: శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-07-12 15:23:58.0  )
ఎమ్మెల్యేలు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి.. కానీ ఆ పని చేయకండి: శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అస్తిత్వం కోసం, త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారుతున్న వారు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్‌కు కేసీఆర్‌కు జై కొట్టిన వారు ఇప్పుడు పార్టీయే ఉండదన్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్ణయించాలి తప్ప కొందరు ఎమ్మెల్యేలో నాయకులు కాదని ధ్వజమెత్తారు. పార్టీ మారే వారు తొందర పడుతున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే కాదు.. ఇంకా పద్నాలుగు పార్టీలకు సీట్లు రాలేదని వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీకి 60లక్షల సభ్యత్వం ఉందని, ప్రజలే పార్టీకి కాపాడుకుంటారన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, సత్తా ఏంటో చూపుతామన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెబుతారన్నారు. ఎమ్మెల్యేలు ఇష్టం లేకుంటే పోండి.. కానీ, తల్లి లాంటి పార్టీని విమర్శించొద్దని కోరారు. పార్టీ ఉండదని శాపనార్ధాలు పెట్టడం మంచిది కాదన్నారు. 33 జిల్లాల్లో ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి దొంగలే బయటకు వెళ్తున్నారన్నారు. పార్టీలో అన్నీ అనుభవించి ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డై వర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed