ఐదేళ్లైన ‘నో’ రుణమాఫీ..! BRS మేనిఫెస్టోలో సైతం లేని ప్రస్తావన

by Rajesh |
ఐదేళ్లైన ‘నో’ రుణమాఫీ..! BRS మేనిఫెస్టోలో సైతం లేని ప్రస్తావన
X

దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలం పూర్తి కాబోతున్న నిజామాబాద్ జిల్లా రైతాంగానికి రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి అని ప్రభుత్వం ఏర్పాటైన మూడు నాలుగు రోజుల్లోనే రుణమాఫీని క్లియర్ చేస్తామంటూ గ్రామాల్లో రైతులకు చెబుతున్నారు. కానీ 2018 సార్వత్రిక ఎన్నికల్లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి, నాలుగు విడతల్లో రుణమాఫీని చేస్తామని చెప్పిన ఐదేళ్లు పూర్తికావస్తున్న ఇప్పటివరకు ఇందూరు జిల్లా రైతాంగానికి రుణమాఫీ అసంపూర్ణంగానే జరిగింది.

పైగా ఈసారి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశం ఊసే లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఐదేళ్లయిన ఇప్పటివరకు రుణమాఫీని పూర్తి చేయలేదని నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లోని రైతుల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తాము అధికారంలోకి రాగానే ఒకే విడతలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనే హామీతో ముందుకు వెళుతుంది.

ఐదేళ్లయిన అసంపూర్ణంగానే రుణమాఫీ..

2018 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ వరకు పంట రుణాలను లక్ష రూపాయల వరకు బకాయి ఉన్న రైతులకు రుణమాఫీని వర్తింపజేస్తామని 2020 లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో రైతులకు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ తొలుత 25 వేల లోపు రుణాలకు రుణమాఫీని ప్రభుత్వం వర్తింపజేసింది. ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా అది ముందుకు సాగలేదు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతాంగానికి అందించాల్సిన రుణమాఫీ అసంపూర్తిగానే నేటికీ మిగిలి ఉండడంతో ఐదేళ్లుగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న జిల్లా రైతాంగానికి నిరీక్షణ మిగిలింది. నిజామాబాద్ జిల్లాలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీకి 2 లక్షల 17వేల రైతులు అర్హులు. కాగా ఇప్పటివరకు సుమారు 68 వేల మంది రైతుల రుణమాఫీ బకాయిలు బ్యాంకుల్లో ప్రభుత్వం చెల్లించింది.

కానీ జిల్లాలో ఇంకా సుమారుగా 1 లక్ష 49 వేల మంది రైతులకు రుణమాఫీ బకాయిలు అందలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం రుణమాఫీ పథకం ద్వారా మాఫీ అవుతుందని గత ఐదేళ్ల నుంచి కొందరు రైతులు పంట రుణాలను పునరుద్ధరించు కోలేదు. కానీ బ్యాంకర్లు మాత్రం ప్రతి ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి వడ్డీలను జోడిస్తూ రైతుల రుణాల ఖాతాలను పెంచుతూ వెళ్లారు. పంట రుణాలను ప్రభుత్వం రుణమాఫీ ద్వారా చేయకపోవడంతో రైతుల వ్యక్తిగత ఖాతాల ద్వారా ఆర్థిక లావాదేవీలను బ్యాంకర్లు నిలిపివేయించారు.

దీంతో పలువురు జిల్లాలోని రైతులు పంట రుణాలకు వడ్డీలను కలుపుతూ రుణాలను పెంచుకుంటూ పోయిన వాటిని రైతులు కట్టి వారి వ్యక్తిగత ఖాతాలను పునరుద్ధరించు కున్నారు. గత ఎన్నికల్లో బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిస్థాయిలో చేయలేదని జిల్లా రైతులను తీవ్రంగా చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒకే విడుదల రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధును ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పంటల బీమాను తెలంగాణ రాష్ట్రంలో చేపట్టలేదని రైతులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. దీంతోపాటు ఉద్యానవన శాఖ ద్వారా అందించే సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందించే వ్యవసాయ పనిముట్లు పూర్తిగా నిలిచిపోయాయని, సబ్సిడీలో డ్రిప్ పరికరాలు సైతం రావడంలేదని రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు.

దీనికి తోడు గత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా పసుపు రైతన్నలకు మాట ఇచ్చిన ప్రకారం భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ఇటీవల పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి రైతుల వద్దకు ముందుకు వెళుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధును బూచిగా చూపి రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ కానట్టేనని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే చర్చ జిల్లా రైతుల్లో తీవ్రంగా జరుగుతుంది.

Next Story

Most Viewed