కేసీఆర్ మీటింగ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..! బీఆర్ఎస్ లో టెన్షన్

by Prasad Jukanti |   ( Updated:2024-06-25 11:14:12.0  )
కేసీఆర్ మీటింగ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..! బీఆర్ఎస్ లో టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో/ములుగు : బీఆర్ఎస్ కీలక నేతల వరుస జంపింగ్‌ల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరుగుతున్న ఈ మీటింగ్‌కు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ విఠల్, షేరి సుభాశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే పలువురు టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ అధినేత నిర్వహిస్తున్న కీలక మీటింగ్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం వెనుక మతలబు ఏంటి? అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే ఓ వైపు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా క్యూ కడుతుంటే ఇవాళ కేసీఆర్ నిర్వహిస్తున్న మీటింగ్‌తో బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో తేలిపోనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

వారంతా.. ‘దానం’ చెప్పినవాళ్లే..

అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్.. లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ సీటును కోల్పోయి 38 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. ఈ క్రమంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఈ సంఖ్య 33కు చేరుకుంది. అయితే ఇవాళ జరుగుతున్న మీటింగ్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్‌పేట- కాలేరు వెంకటేశ్, ఎల్బీనగర్- సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి- మర్రి రాజశేఖర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిపాల్‌రెడ్డి ఢిల్లీలో ఉండగా మిగతా వారు కేసీఆర్‌కు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అయితే వీరంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని ఇటీవల దానం నాగేందర్ చెప్పినవారే కావడం గమనార్హం. దీంతో ఈ ఐదుగురు కారు దిగి చేయి అందుకోబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఇంకా మీటింగ్ జరుగుతున్నందున సాయంత్రం వరకు వీరు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారా లేక దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed