ఎల్బీనగర్ టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ.. సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే జరిగేది ఇదే?

by GSrikanth |   ( Updated:2022-08-10 06:28:03.0  )
ఎల్బీనగర్ టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ.. సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే జరిగేది ఇదే?
X

దిశ, ఎల్బీనగర్: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాగా, మరొకరు నియోజకవర్గ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్. సుధీర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుండి ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. సుధీర్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రామ్మోహన్ గౌడ్ సెగ్మెంట్లోని 11 డివిజన్‌లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు.

సుధీర్ రెడ్డి కారెక్కిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్‌లలో ఒక్కటంటే ఒక్కటీ గెలిపించుకోలేకపోయారు. సుధీర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిన తర్వాత రామ్మోహన్ గౌడ్ కొంత సైలెంట్‌గా ఉన్నారు. అదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమనే వాదన కూడా లేకపోలేదు. అయితే, ప్రస్తుతం ఇద్దరు నేతలు టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రజల మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీలు ఎటు వైపు ఉంటారనే చర్చ జరుగుతోంది. అయితే రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు అగ్రవర్ణాలకు చెందిన వారే కావడంతో టీఆర్ఎస్ అధిష్టానం బీసీ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో ఎవరికి వారు అధికార పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సుధీర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సపోర్ట్ ఉంటే.. రామ్మోహన్ గౌడ్‌కు ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులు ఉన్నట్లు తెలిసింది. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బీసీలు ఎటువైపు..?

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బీసీ నేతగా ఎదిగాడు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. మెజార్టీ బీసీలంతా ఆయన వెంటే ఉన్నట్లు తెలిసింది. ఇక స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తారనే చర్చ జరుగుతుంది. అన్ని శాఖల్లో ఉన్నత స్థాయి అధికారులను తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల పోలీస్ శాఖలో ఓ ఏసీపీ స్థాయి అధికారిని బదిలీ చేస్తే.. పట్టుబట్టి అతడినే నియమించుకున్నారనే వాదన కూడా ఉంది. దీంతో సుధీర్ రెడ్డికి ఈసారి టీఆర్ఎస్ టికెట్ దక్కితే బీసీలు ఎటువైపు మొగ్గుచూపుతారనే చర్చ జరుగుతుంది.

'డిసెంబరే బెంగాల్ ప్రభుత్వానికి చివరి నెల'

Advertisement

Next Story