బీఆర్ఎస్ కార్యకర్త మర్డర్ మరుకవ ముందే మరో ఘటన.. ఆ జిల్లాలో ఫ్యాక్షన్ పాలిటిక్స్!

by Prasad Jukanti |
బీఆర్ఎస్ కార్యకర్త  మర్డర్ మరుకవ ముందే మరో ఘటన.. ఆ జిల్లాలో ఫ్యాక్షన్ పాలిటిక్స్!
X

దిశ, అచ్చంపేట/డైనమిక్ బ్యూరో : ప్రశాంతమైన తెలంగాణ పల్లెల్లో రాజకీయ పగలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లు రాయలసీమలో వినిపించిన ఫ్యాక్షన్ పగలు ప్రస్తుతం తెలంగాణకు పాకుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యా రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. నిన్న కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీ‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి (50) దారుణ హత్య ఘటన మరువక ముందే ఇవాళ అచ్చంపేటలో పట్టపగలు కాంగ్రెస్ నాయకులపై కత్తితో దాడి జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ హత్యలు, దాడుల వెనుక ఆధిపత్య పోరు, వ్యక్తిగత కక్షలు ఉన్నాయని ఓ వర్గం ఆరోపిస్తుంటే ఇదంతా రాజకీయ కక్షలో భాగంగా జరుగుతున్నాయని మరోపక్షం వాదిస్తోంది. పార్టీల మధ్య వాదోపవాదనలు ఎలా ఉన్నా అంతిమంగా ఈ మర్డర్ పాలిటిక్స్ ఎటువైపు దారి తీస్తాయో? ఇంకెవరిని బలి తీసుకుంటాయో? అనేది జిల్లావాసులను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

పగబట్టిన రాజకీయం...

అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఇవాళ కాంగ్రెస్ నాయకుడు లాలు‌యాదవ్, అంజిపై బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త బాలరాజు కత్తితో దాడి చేశారు. స్థానికంగా ఉన్న సాయిరాం థియేటర్ వద్ద ఎటాక్ చేయగా ఈ ఘటనలో బాలరాజు తల, మెడ భాగాల్లో గాయాలయ్యాయి. అంజి అనే వ్యక్తి కాలు ఫ్రాక్చర్ అయింది. ఎంపీ ఎన్నికల సందర్భంగా ఈనెల 15న బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయగా ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రతిదాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన దాడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అచ్చంపేట ఎస్ఐ రాములు తెలిపారు. లాలు యాదవ్, అంజిపై సుంకరి బాలరాజు మరోవ్యక్తి కలిసి దాడి చేసినట్లు వెల్లడించారు. కాగా బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకే గువ్వల బాలరాజు అనుచరులు కత్తులతో హత్యా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న అచ్చంపేటలో కక్షా రాజకీయాలు భగ్గుమంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వ్యక్తిగతమా.. రాజకీయమా?

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటలు హడలెత్తిస్తున్నాయి. కొల్లాపూర్‌లో మల్లేశ్‌యాదవ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. దీన్ని రాజకీయ హత్య అని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఘటన మరువక ముందే నిన్న అదే పార్టీకి చెందిన శ్రీధర్‌రెడ్డి హత్యకు గురికావడంతో ఇదంతా మంత్రి జూపల్లి ప్రోద్బలంతోనే సాగుతోందని, ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్‌వి శవ రాజకీయాలని మంత్రి కౌంటర్ వేశారు. గతంలో జరిగిన మల్లేశ్ యాదవ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ కు తగదని గతంలోనే విమర్శించిన జూపల్లి.. తాజాగా శ్రీధర్‌రెడ్డి హత్యలోనూ బీఆర్ఎస్ ఆరోపణలు ఖండించారు.

బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు దురదృష్టకరం : మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిన్న కొల్లాపూర్‌లో హత్యకు గురైన శ్రీధర్‌రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. గతంలో మా కార్యకర్తలు మరణించినప్పుడు ఇలా ఆరోపణలు చేయలేదన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హత్యలకు రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదని సూచించారు. కేటీఆర్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డి హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed