- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్ తరాలకు మేలు.. కొత్త రెవెన్యూ చట్టంపై నిపుణుల స్పందన
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ఏ విధంగానైతే రూపకల్పన జరిగిందో.. అదే తరహాలో కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదా ఉందని భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ కుమార్ అన్నారు. రాజ్యాంగం రూపకల్పన సమయంలోని ప్రపంచ దేశాలలో ఉన్న మంచిని తెచ్చి మన రాజ్యాగంలో రాసుకున్నట్టుగా ఈ చట్టంలో కూడా దేశంలోని 18 రాష్ట్రాలలో ఉన్న ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి అందులో ఉన్న మంచిని తీసుకున్నట్టుగా తెలిపారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదాపై బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లతో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 1936, 1948,1971, 2020లలో మొత్తం నాలుగు సార్లు ఆర్వోఆర్ చట్టాలు వచ్చాయన్నారు. ఇప్పడు రాబోయే ఐదో ఆర్వోఆర్ -2024 చట్టానికి ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే 10-20 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ చట్ట రూపకల్పన జరిగిందన్నారు. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హక్కులు దక్కుతాయన్నారు. వీటి కేంద్రంగానే కొత్త చట్టం ఉండబోతుందన్నారు. వ్యవసాయ భూములకు ఏ విధంగానైతే భూమి హక్కుల రికార్డు ఉంటుందో.. కొత్త చట్టంలో వ్యవసాయేతర భూములకు కూడా భూమి రికార్డు రాబోతుందన్నారు. దేశంలో వస్తున్న మార్పులకు, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న భూ విధానాలకు అనుగుణంగా కొత్త చట్టం ఉందన్నారు. కొత్త చట్టంపై విమర్శలు చేయడం కంటే.. సలహాలు, సూచనలు చేయాలని కోరారు.
రైతు సేవలో చట్టం
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడంతో రైతులకు, ప్రజలకు సేవలు దూరమయ్యాయని డిప్యూటీ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందాలంటే కొత్త ఆర్వోఆర్ చట్టంతోనే సాధ్యమన్నారు. క్షేత్ర స్థాయిలో భూ పరిపాలన వ్యవస్థలను బలోపేం చేస్తూ రైతులకు భూ సమస్యలను పరష్కరించేందుకే కొత్త చట్టం యొక్క ఆవశ్యకత ఏర్పడిందన్నారు. చట్టం అంటే ఎక్కడో కూర్చేని చేస్తే దాంతో ప్రజలకు సేవలు అందవన్నారు. ప్రజల నుంచే చట్టం రావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్త చట్టం యొక్క ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచిందన్నారు. గత పాలకులు చట్టాన్ని చేసి ప్రజల ముందుకు తెచ్చేవారని గుర్తు చేశారు. ఈ ప్రజా ప్రభుత్వం ముసాయిదాను తీసుకొచ్చి ప్రజాభిప్రాయాల్ని కోరడం అనేది ఒక చరిత్రగా పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూల్స్ ని కూడా మార్చుకొనే వెసులుబాటు ఈ చట్టంలో ఉందన్నారు. కొత్త చట్టంతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు అందడంతో పాటు సమస్యలను కూడా అక్కడే పరిష్కరించునే విధానం రాబోతుందన్నారు. గ్రామానికో రెవెన్యూ అధికారి కూడా అందుబాటులో ఉంటూ సేవలంధించే రోజులు కూడా రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఏ చిన్న సమస్య వచ్చిన రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి సీసీఎల్ఏకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. కొత్త చట్టంలో అధికారుల వికేంద్రీకరణతో ప్రజలకు గ్రామ, మండల స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
రైతులకు చుట్టంగా చట్టం
కొత్త రెవెన్యూ చట్టం పేదలకు, రైతులకు చుట్టంగా మారనుంది. ఒక్కరిద్దరి కోసం కాకుండా తెలంగాణ ప్రజల భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆర్వోఆర్ చట్టం -2024 ముసాయిదా ఉంది. ప్రపంచంలో, దేశంలో మారుతున్న పరిస్థితులకు, రోజురోజుకు పెరిగి పోతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఙానానికి అనుగుణంగా చట్ట రూపకల్పన చేశారని పలువురు వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్ సరిత, వైస్ ప్రెసిడెంట్లు శకుంతల, శ్రీనివాస్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రాములు, సెక్రటరీ జనరల్ ఎల్.పూల్‌సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రాధా, కోశాధికారి శ్రీనివాసశంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.