గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఒక్కసారిగా పాము కనిపించడంతో..

by Rajesh |
గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఒక్కసారిగా పాము కనిపించడంతో..
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్‌లో మరో సొరంగం బయట పడింది. చారిత్రాత్మక ముష్క్ మహల్‌లో వెలుగు చూసిన ఈ సొరంగం చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కులీ కుతుబ్ షా నవాబుల్లో ఆఖరి వాడైన అబుల్ హాసన్ తానా షా 1681వ సంవత్సరంలో ఈ రెండంతస్తుల ముష్క్ మహల్‌ను నిర్మించారు. అప్పట్లో దీనిని గెస్ట్ హౌస్‌లా ఉపయోగించేవారని చరిత్ర. కాగా, ఈ మహల్‌లో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. ఈ క్రమంలోనే కొందరు యువకులు బుధవారం ఉదయం మహల్‌లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు సమాచారం. ఆ సమయంలో ఓ పెద్ద బండరాయితో పాటు పాము పైనుంచి పడటంతో ఆ యువకులు పారిపోయినట్టు తెలిసింది. విషయం తెలిసి అక్కడకు వెళ్లిన పోలీసులకు సొరంగం కనబడటంతో పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. యువకులు గుప్త నిధుల కోసం రాలేదని, ఫోటోలు దిగటానికి వచ్చారని పోలీసులు చెప్పారు.

ఆ సొరంగంలోని భాగమేనా?...

చార్మినార్ నుంచి గోల్కొండ కోటకు సొరంగ మార్గం ఉండేదన్న ప్రచారం కొన్నేళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్‌లో ఇలాంటి సొరంగం వెలుగు చూసింది. అప్పుడు కూడా చార్మినార్ నుంచి బహదూర్ పురా, మెహదీపట్నం మీదుగా గోల్కొండకు ఉన్న సొరంగమే ఇది అన్న వార్తలు వచ్చాయి. దాంతో పురావస్తు శాఖ అధికారులు సొరంగం రహస్యాన్ని ఛేధించేందుకు ప్రయత్నించారు. అయితే, దారిలో నివాసాలు ఉండటంతో సాధ్యం కాలేదు. ప్రస్తుతం ముష్క్ మహల్ వద్ద సొరంగం బయట పడటంతో ఇది చార్మినార్ నుంచి గోల్కొండ కోటకు ఉన్న సొరంగ మార్గమే అని భావిస్తున్నారు. చార్మినార్ - గోల్కొండ కోట మధ్యలో ముష్క్ మహల్ ఉండటం గమనించాల్సిన విషయమని చెబుతున్నారు. మరి పురావస్తు శాఖ అధికారుల పరిశీలనలో ఏం బయట పడుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed