TS: నేడే టీచర్ MLC పోలింగ్.. మొత్తం ఎంతమంది బరిలో నిలిచారంటే?

by GSrikanth |   ( Updated:2023-03-12 23:30:23.0  )
TS: నేడే టీచర్ MLC పోలింగ్.. మొత్తం ఎంతమంది బరిలో నిలిచారంటే?
X

దిశ, సిటీ బ్యూరో: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ను నిర్వహించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 29 వేల 720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు కాగా, 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 22 అభ్యర్థులు నిలిచినట్లు తెలిపారు. ఈనెల 16వ తేదీన ఓట్లు లెక్కింపు జరుగుతుందని అన్నారు.

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ పేపర్‌తో నిర్వహిస్తున్న ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు కేటాయించిన ప్రత్యేక రూట్‌లో సరూర్ నగర్‌లోని డిస్ట్ర్రిబ్యూషన్ సెంటర్‌కు తరలించి, ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించి, ఫలితాన్ని ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా 9186 మంది ఓటర్లు రంగారెడ్డి జిల్లాలో ఉండగా, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 664 మంది ఓటర్లున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

పోలింగ్ సరళిపై నిరంతర పర్యవేక్షణ: రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక ఆలా తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. స్టాచుచరి, నాన్ స్టాచుచరి పత్రాలతో పాటు బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, ఓటరు జాబితాను ఎన్నికల సిబ్బంది పరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. పోలింగ్ సమగ్ర నిర్వహణకు ఎలక్షన్ విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 12 సెక్టరోల్ అధికారులను, 29 మంది అబ్జర్వర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తు, ఓటర్లకు మౌలిక సదుపాయాలు త్రాగునీరు, టెంట్లు ఏర్పాటు, దివ్యాంగుల కోసం ర్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. రిసెప్షన్ సెంటర్‌ను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది తమ పోలింగ్ సామాగ్రితో పాటు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు.




Advertisement

Next Story

Most Viewed