ఆ నాలుగు శాఖల సిబ్బందికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |
ఆ నాలుగు శాఖల సిబ్బందికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చనిపోయిన కుటుంబాలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను, బ్రిడ్జిలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. నిర్వాసితులకు వరద సహాయక కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు, భోజన సదుపాయాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇండ్లు నీట మునిగిన వారికి నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరారు.

వరద తగ్గుముఖం పట్టిన వెంటనే నష్టపోయిన పంటపొలాలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోతకు గురైన పొలాలను సరిచేయడానికి ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలన్నారు. పశువులు, గొర్రెలు, మత్స్యసంపద నష్టాలను అంచనా వేసి వారికి కూడా నష్టపరిహారం అందించాలని ఆయన పట్టుపట్టారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, సరిపోయేంత మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బందికీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీసు సిబ్బందికి రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed