Minister Ponnam Prabhakar: వందశాతం అడ్మిషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం

by Gantepaka Srikanth |
Minister Ponnam Prabhakar: వందశాతం అడ్మిషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గల్ఫ్ కార్మికుల(Gulf workers) కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటున్నది. గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ సెల్ మాత్రమే ఉంటే ఇప్పుడు మాత్రం వారి వెల్ఫేర్ కోసం బోర్డును ఏర్పాటు చేసే దిశగా కసరత్తు మొదలైంది. గత కొన్ని వారాలుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్న బాధతలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ బోర్డును ఏర్పాటు చేయనున్నది. దీని పనితీరు, అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శనివారం మీడియాకు వివరించారు. రానున్న రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘాల ప్రతినిధులతో లోతుగా చర్చలు జరిపనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యావకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలు కూడా ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, పేదరికంతో బాధపడుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన సంఘాల ప్రతినిధులు ఆ కుటుంబాలకు కూడా తలా లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాలను ఇవ్వాల్సిందిగా మంత్రికి సూచించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి నిర్విహించిన సమావేశంలో ఈ ప్రతిపాదనలు రాగా ప్రభుత్వంతో చర్చించి విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్ (వేములవాడ ఎమ్మెల్యే) ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన ఐదు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించే సలహా కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభ్యులుగా నియమించాలని, ఇందుకోసం జీవోను విడుదల చేయాలని మంత్రికి సూచించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి పేరుతో ప్రత్యేక కౌంటర్ పెడితే బాగుంటుందని సూచించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి... దానితో పాటే గురుకుల పాఠశాలలో, కళాశాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 100% అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా కోసం కటాఫ్ డేట్‌పై వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలతో పాటు ఇటీవల సింగపూర్, మలేషియా కార్మికులూ ఇబ్బందులు పడుతున్నారని ఆ సంఘాల ప్రతినిధులు సూచించారు.

తెలంగాణలో 150 ట్రేడ్ లైసెన్స్ కలిగిన మాన్‌పవర్ ఎక్స్ పోర్ట్ కంపెనీలు ఉన్నాయని, సెట్విన్, టాంకాం (తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ), ‘న్యాక్’ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రికి వారు సూచించారు. ఏజెన్సీల పేరుతో జరిగే మోసాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే భౌతికకాయాలను తీసుకు రావడానికి వారం రోజులకు పైగా సమయం పడుతున్నదని, 48 గంటల్లోనే తెచ్చేలా చూడాలన్నారు. దేశంలోనే బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళలో ఉన్నదని, దానిని స్టడీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేరళలో జీడీపీకి గల్ఫ్ కార్మికుల ద్వారా గణనీయమైన రెవెన్యూ వస్తున్నదని, తెలంగాణలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed