హరితహారానికి ఉపాధి నిధులు.. దుర్వినియోగంపై ఈడీకి కంప్లైంట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-02 02:35:18.0  )
హరితహారానికి ఉపాధి నిధులు.. దుర్వినియోగంపై ఈడీకి కంప్లైంట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలయ్యే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించడంపై కేంద్ర బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల అవసరాలకు కల్లాల నిర్మాణానికి ఖర్చు చేయడంపై సర్కారుకు నోటీసులు జారీచేసింది. సుమారు రూ. 153 కోట్ల మేర రికవరీ చేయాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల లేఖ రాసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటున్న హరితహారం పథకానికి కూడా గ్రామీణ ఉపాధి స్కీమ్ నిధులను వాడినట్లు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. హరితహారం ఉనికిలోకి వచ్చింది మొదలు 2017-18 వరకు మూడేళ్ల కాలంలో సుమారు రూ. 1,479 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. ఆ మూడేళ్ల కాలానికి హరితహారం పథకం కోసం అయిన రూ. 2,359 కోట్ల ఖర్చులో ఇది సుమారు 62శాతం.

గతేడాది సెప్టెంబరు చివరి వరకు హరితహారం కోసం సుమారు రూ. 9,777 కోట్లను ఖర్చు చేయగా అందులో రూ. 5,006 కోట్లు గ్రామీణభివృద్ధి శాఖ నుంచే వెచ్చించినట్లు రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా హరితహారం కోసం ఎలాంటి నిధులు విడుదల చేయకపోయినప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు నర్సరీలో పెంపకానికి కూడా ఈ నిధులను వినియోగించినట్లు తేల్చారు. ఈ నిధులకు అదనంగా ఎఫోరెస్టేషన్ ఫండ్, కాంపా ఫండ్స్‌ను సైతం వాడినట్లు పేర్కొన్నారు. అటవీ శాఖ ద్వారా కేవలం రూ. 2,567 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు వివరించారు. మిగిలిన దాన్ని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రీన్ ఫండ్ తదితరాల నుంచి వినియోగించినట్లు పేర్కొన్నారు.

హరితహారం పథకానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులను వాడడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు వెళ్లింది. గ్రామీణ ఉపాధి హామీ నిధులను వాడడంతో పాటు మొక్కల కొనుగోళ్లకు మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తంలో వెచ్చించినట్లు ఆ ఫిర్యాదులో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ వివరించారు. ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ నిధుల డైవర్షన్‌పై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ హరితహారం స్కీమ్ అమలులో దొర్లిన లోపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఈడీ అధికారులను బక్క జడ్సన్ ఆ కంప్లైంట్‌లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను హరితహారం స్కీమ్‌కు చాలా తెలివిగా డైవర్ట్ చేసిందని, దీనిపైన లోతుగా ఎంక్వయిరీ చేయాలని విజ్ఞప్తి చేశారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ఆధారంగా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ సైతం ఫారెస్టు రిపోర్టులో అప్‌డేట్ చేసింది.

హరితహారం పథకం లాంఛనంగా ప్రారంభం కావడానికి ముందు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం అమలయ్యేదని, దానికి కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన ఫండ్స్‌ను వినియోగించినట్లు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎఫోరెస్టేషన్ (అడవుల పెంపకం), కాంపా నిధులను వినియోగించినా ఈ రెండింటితో పోలిస్తే ఉపాధి హామీ పథకం నుంచి ఖర్చుచేసిందే ఎక్కువ అని గణాంకాలను వెలువరించారు. హరితహారం పథకంలో భాగంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఓఆర్ఆర్ తదితర చోట్ల హెచ్ఎండీఏ నిధులను సుమారు రూ. 634 కోట్ల మేర ఖర్చు పెట్టగా, నగరం పరిధిలో జీహెచ్ఎంసీకి చెందిన సుమారు రూ. 114 కోట్లను వెచ్చించినట్లు వివరించారు. నాలుగేళ్లుగా గ్రీన్ ఫండ్ వసూలు చేస్తుండడంతో దాని ద్వారా సమకూరిన రూ. 1,454 కోట్లను కూడా ఈ స్కీమ్‌కే వాడినట్లు తెలిపారు.

రాష్ట్ర అటవీ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం హరితహారం పథకానికి (మొక్కలు నాటే పనులతో కలిపి) వినియోగించిన ఉపాధి హామీ (గ్రామీణాభివృద్ధి) నిధుల వివరాలు (కోట్ల రూ.లలో)

సంవత్సరం ఉపాధి నిధులు

2014-15 256.99

2015-16 365.04

2016-17 401.58

2017-18 455.72

2018-19 687.32

2019-20 661.93

2020-21 830.28

2021-22 996.17

2022-23 351.77

మొత్తం 5,006.82

Also Read...

దూకుడు పెంచిన టీ-టీడీపీ.. ప్రతీ గడపనూ టచ్ చేసేలా ప్లాన్!

Advertisement

Next Story

Most Viewed