మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు.. కరెంటు కోతలపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

by GSrikanth |
మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు.. కరెంటు కోతలపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరెంటు సరఫరా సరిగ్గా లేదని, కోతలు అమలవుతున్నాయని ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్లపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డిమాండుకు తగినంత సరఫరా ఉన్నదని, కరెంటు కోతలు లేవని స్పష్టం చేశారు. వివిధ రకాల పబ్లిక్ మీటింగులు, మీడియా సమావేశాల్లో కరెంటు పోతున్నదంటూ ఇటీవల పొలిటీషియన్లు కామెంట్ చేస్తున్నారని, కానీ దానికి అసలు కారణం వారు వాడుతున్న జనరేటర్ పవర్ సరఫరాలో ఏర్పడిన టెక్నికల్ సమస్యలే తప్ప ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ సప్లైతో ఎలాంటి సంబంధం లేదని జేఏసీ చైర్మన్ సాయిబాబు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కరెంటు కోతలను అస్త్రంగా ఎంచుకోవడాన్ని తప్పుపట్టిన ఆయన... విద్యుత్ సిబ్బంది స్థయిర్యాన్ని దెబ్బతీయవద్దని, వారిని మానసికంగా క్షోభకు గురిచేయవద్దని సూచించారు.

విద్యుత్ సిబ్బంది లోపమంటూ ప్రచారం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి సిబ్బంది రేయింబవళ్ళు పనిచేస్తున్నారని, విద్యుత్ శాఖకు సంబంధమే లేని అంతర్గత సాంకేతిక సమస్యలను ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలతో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి పని చేస్తున్న సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటున్నదన్నారు. ప్రస్తుత సీజన్‌లో అంచనాకు మించి డిమాండ్ వస్తున్నదని, అయినా అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అంతరాయాల్లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. గతేడాది 15,497 మెగావాట్ల డిమాండ్ ఈ సంవత్సరం మార్చి చివరి నాటికే 15,623 మెగావాట్లకు చేరుకున్నదన్నారు.

Advertisement

Next Story

Most Viewed