వర్షంలో విద్యుత్ సిబ్బంది సాహసం

by Prasanna |
వర్షంలో విద్యుత్ సిబ్బంది సాహసం
X

దిశ, నవాబుపేట: నవాబుపేట మండలం పొమాల్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు విద్యుత్ సిబ్బంది వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా సాహసం చేసారు. ప్రతికూల పరిస్థితుల్లో గాఢాంధకారం నెలకొని ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి రాత్రివేళలో విధులు నిర్వహించారు. చెరువులో ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో గల స్తంభంపై నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి సెల్ ఫోన్ లైట్ వెలుగును ఆధారం చేసుకుని విద్యుత్తును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు.

33 కెవి పిన్ ఇన్సులేటర్ ఫెయిల్ అవ్వడం వలన గంటసేపు కరెంటు నిలిచిపోయింది. లైన్మెన్ శ్రీకాంత్, హెల్పర్ రాజేందర్ లు వెంటనే అప్రమత్తమై కొల్లూరు గ్రామ సమీపంలో ఉన్న రంగంబాయి తాండ చెరువులో ఉన్న 33 కెవి ఇన్సులేటర్ ఫెయిల్ అయిన స్థలానికి చేరుకున్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో వర్షం కురుస్తున్న కూడా లెక్క చేయక చెరువులో సాహసంగా ఈత కొడుతూ వెళ్లి అతి కష్టం మీద స్తంభం ఎక్కి మరమ్మత్తులు జరిపించారు. పోమాల్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలన్నింటికీ కరెంటు సరఫరా అయ్యేటట్లు పనులు పూర్తి చేశారు.

లైన్మెన్ శ్రీకాంత్ సూచనలు చేస్తుండగా రాజేందర్ వాటిని పాటిస్తూ స్తంభం పైకి ఎక్కి పిన్ ఇన్సులేటర్ కు మరమ్మతులు పూర్తి చేసి రాజేందర్ చెబుతున్న జాగ్రత్తలను పాటిస్తూ చెరువు నీటిలో ఈదుకుంటూ తిరిగి క్షేమంగా బయటకు వచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాడు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో విద్యుత్ సిబ్బంది శ్రీకాంత్, రాజేందర్ లు ప్రాణాలకు తెగించి వర్షంలో చెరువులో ఈత కొడుతూ వెళ్లి అతి కష్టం మీద స్తంభం ఎక్కి సెల్ ఫోన్ లైట్ ఆధారంగా మరమ్మతులు చేయడానికి తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed