వ్యక్తి కాదు వ్యవస్థ.. రామోజీరావు పూర్తి ప్రస్థానం

by Gantepaka Srikanth |
వ్యక్తి కాదు వ్యవస్థ.. రామోజీరావు పూర్తి ప్రస్థానం
X

దిశ, తెలంగాణ బ్యూరో/శేరిలింగంపల్లి: మీడియా అధిపతి, సినీ నిర్మాత, వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు (88) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు చివరి గంటల్లో వెంటిలేటర్‌ను అమర్చారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఇటీవలే స్టంట్ అమర్చారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చాలాకాలంగా ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీకి మాత్రమే పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు, కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి తదితరులంతా అక్కడికే వెళ్లి ఆయనను కలుసుకున్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ఐదు దశాబ్దాలుగా..

ఐదు దశాబ్దాలుగా వివిధ రకాల వ్యాపారాలు చేసిన ఆయన తన పేరు మీదనే రామోజీ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి శివారు ప్రాంతంలో 1,600 ఎకరాలకు పైగా ప్రాంతంలో రామోజీ ఫిల్మ్ సిటీని నెలకొల్పారు. ఈవెంట్లతో పాటు సినిమా, సీరియల్ షూటింగులకు అది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తొలుత ప్రియా పచ్చళ్లు, మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన ఈనాడు దినపత్రికతో పత్రికారంగంలోకి అడుగు పెట్టారు. ఉషాకిరణ్ మూవీస్ పేరుతో చలనచిత్ర రంగంలోకీ ప్రవేశించారు. అప్పటికే డాల్ఫిన్స్ హోటల్స్‌ను స్థాపించిన ఆయన.. కళాంజలి, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో భిన్నమైన వ్యాపారాన్ని ప్రారంభించారు.

పత్రికారంగంలో తనదైన ముద్ర

1974లో ఈనాడు తెలుగు దినపత్రిక (విశాఖపట్నం ఎడిషన్)ను స్థాపించిన రామోజీరావు దాన్ని పాపులర్ చేయడానికి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి నుంచి ఉన్న పోటీని తట్టుకోడానికి ఇబ్బందులు పడ్డారు. మూడేండ్లలో ఆ బాలారిష్టాలను అధిగమించిన ఈనాడు.. ఒక్క సంవత్సరంలోనే హైదరాబాద్ ఎడిషన్‌‌ కూడా ఉనికిలోకి వచ్చింది. 48 వేల కాపీలతో ఏబీసీ (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులరేషన్) జాబితాలోకి ఎక్కి పాపులర్ దినపత్రికగా అవతరించింది. క్రమంగా సినిమాల కోసం సితార, రైతుల కోసం అన్నదాత, కథల కోసం విపుల, చతుర లాంటి పత్రికలను కూడా స్థాపించి 1980వ దశకంలో జిల్లాలకు ప్రత్యేకంగా టాబ్లాయిడ్ (జిల్లా ఎడిషన్)లను పరిచయం చేయడంలో రామోజీరావు కొత్త ఒరవడి సృష్టించారు. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వినియోగించుకుని ఎడిషన్ కేంద్రాలను పెంచుకుని ఆల్ కలర్ పేజీలతో పత్రికను తీర్చిదిద్దారు. జర్నలిజం స్కూల్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ఆ పత్రిక అవసరాలను సొంతంగా తీర్చుకోవడంపై ఫోకస్ పెట్టారు.

టీడీపీకి అనుబంధమని విమర్శలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో దానికి అనుబంధంగా మారారనే విమర్శలను రామోజీరావు మూటగట్టుకున్నారు. ఇప్పటికీ ఆ అపవాదు కొనసాగుతూనే ఉన్నది. దినపత్రిక ద్వారా మీడియా రంగంలోకి ప్రవేశించిన ఆయన... ఈటీవీ పేరుతో టీవీ చానల్‌ (ఎంటర్‌టైన్‌మెంట్)ను ప్రారంభించి తర్వాత ప్రత్యేక న్యూస్ చానెల్‌ను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు న్యూస్ చానళ్లను నెలకొల్పారు. అనేక ప్రాంతీయ భాషల్లో ఈటీవీ భారత్ ద్వారా న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీ కేంద్రంగానే ఒక్కో భాషకు ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేసి అటు టీవీలలో, ఇటు డిజిటల్ రూపంలో పాపులర్ చేశారు. పిల్లలు, మహిళలకు సైతం ప్రత్యేక చానళ్లను నెలకొల్పిన ఆయన.. వంటల కోసం, ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేక చానళ్లను రన్ చేస్తున్నారు.

సాగుపై అభిమానంతో ‘అన్నదాత’

కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబర్ 16న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు వ్యవసాయం మీద ఉన్న అభిమానంతో ‘అన్నదాత’ పేరుతో మాసపత్రికను ప్రారంభించారు. టీవీ చానల్‌లో సైతం అదే పేరుతో ప్రత్యేకంగా అరగంట కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ పన్నెండేళ్ల క్రితం (2012లో) చనిపోయారు. పెద్ద కుమారుడు చెరుకూరి కిరణ్, సుమన్ భార్య చెరుకూరి విజయేశ్వరి ప్రస్తుతం రామోజీ గ్రూపులో వాటాదారులుగా ఉన్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయినా.. మార్గదర్శి చిట్‌ఫండ్ బిజినెస్‌లో అనేక ఆరోపణలు ఎదుర్కొని కోర్టుల్లో కేసులపాలయ్యారు. ప్రజల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలలోకి మళ్లించారంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన కేసు ఇప్పటికీ కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నది.

సినీ రంగంలో ఆణిముత్యాలు

1980వ దశకం ప్రారంభంలో సినీ రంగంలోకి ఎంటర్ అయిన రామోజీరావు శ్రీవారికి ‘ప్రేమలేఖ’ చిత్రాన్ని 1984లో నిర్మించారు. దాదాపు 60 సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఆయన.. ‘నువ్వేకావాలి’ చిత్రానికి (2000లో విడుదలైంది) జాతీయ అవార్డు లభించింది. 1985లో విడుదలైన ‘ప్రతిఘటన’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. విజయశాంతి నటించిన ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ నుంచి బెస్ట్ ఫిలిం అవార్డు లభించింది. దానికి కొనసాగింపుగా ‘మయూరి’, ‘కాంచనగంగ’, ‘నువ్వే కావాలి’, ‘మౌనపోరాటం’, ‘అశ్విని’, ‘తేజ’ తదితర చిత్రాలకు నంది అవార్డులు కూడా వచ్చాయి.

భూకబ్జాలంటూ ఆరోపణలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ పేరుతో ఉన్న స్థలాన్ని లక్ష నాగళ్లతో దున్ని స్వాధీనం చేసుకుంటామంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయారని, వారిద్దరి మధ్య స్నేహం కుదరడమే ఇందుకు కారణమంటూ ఇద్దరిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక ప్రజల నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారని, బెదిరించారని, రాజకీయ నేతల ధైర్యంతో తక్కువ ధరకు కొనుగోలు చేశారని, అసైన్డ్ లాండ్స్‌ను ఆక్రమించారని రామోజీరావు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed