- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవితపైనే ఈడీ ఫోకస్? మాజీ ఆడిటర్ బుచ్చిబాబు విచారణతో హై టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏకకాలంలో అటు సీబీఐ, ఇటు ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసు జారీ చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును ఎంక్వయిరీ చేయడానికి ఈడీకి స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది.
ఈ నెల 8న సీబీఐ ఆయనను అరెస్టు చేసి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి నడుపుతున్న సౌత్ గ్రూపు ప్రమేయం గురించి అధికారులు ఆరా తీశారు. ఇప్పుడు ఇదే కేసులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘన తదితరాలపై ఈడీ బుచ్చిబాబును విచారించనున్నారు.
సౌత్ గ్రూపులో కవిత కీలక సభ్యురాలు అని ఈడీ తన కామన్ చార్జిషీట్‌లో ఆరోపణలు లేవనెత్తింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఆరా తీస్తున్నది. ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించిన బుచ్చిబాబు ద్వారా ఆర్థిక అంశాలను రాబట్టాలని ఈడీ భావిస్తున్నది. ఈ నెల 8న సీబీఐ ఆయన్ను అరెస్టు చేయగా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్నారు.
లిక్కర్ కేసులో కీలక భూమిక పోషించిన రాబిన్ డిస్టిల్లరీస్ కంపెనీకీ గతంలో బుచ్చిబాబు ఆడిటర్‌గా వ్యవహరించారు. ఈ డిస్టిల్లరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ గురించి కవితతో చర్చించినట్టు ఈడీ దగ్గర తగిన ఆధారాలు ఉండటంతో వీటిని చార్జిషీట్‌లోనూ ఈడీ అధికారులు ప్రస్తావించారు.
కవిత నివాసంలో చర్చల్లో బుచ్చిబాబు
ఈడీ తన కామన్ చార్జిషీట్‌లో కవితకు లిక్కర్ స్కామ్‌లో ఏ రూపంలో సంబంధం ఉన్నదో కొన్ని అంశాలను ప్రస్తావించింది. పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన ఈడీ.. వారి నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్లను విశ్లేషించిన తర్వాత కొన్ని ఘటనలను ఉదహరించింది. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీపై 2021 మే నెలలో చర్చలు జరిగాయని, అందులో ఆడిటర్ బుచ్చిబాబు కూడా పాల్గొన్నట్లు ఈడీ ఆరోపించింది.
ఆర్థిక వ్యవహారాల్లో బుచ్చిబాబుకు తగినంత పరిజ్ఞానం ఉందన్న ఉద్దేశంతో ఢిల్లీలోని లిక్కర్ మార్కెట్ అనాలిసిస్ చేయాల్సిందిగా శరత్‌చంద్రారెడ్డి అతని సహాయం తీసుకున్నారు. ఆ మీటింగు తర్వాతనే బుచ్చిబాబు, బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో సమీర్ మహేంద్రుతో చర్చలు జరిపారు. దానికి కొనసాగింపుగా శరత్‌చంద్రారెడ్డికి చెందిన చార్టర్డ్ ఫ్లైట్‌లో వారంతా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కీలక చర్చలు ఢిల్లీలో జరుగుతున్న సమయంలో బుచ్చిబాబు కూడా పలు దఫాలుగా అందులో పాల్గొన్నారు. గౌరి అపార్టుమెంటులో జరిగిన మీటింగులోనూ ఆయన పాలుపంచుకున్నారు. బోయిన్‌పల్లి అభిషేక్, బుచ్చిబాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు కాన్ఫరెన్సు కాల్‌లో మాట్లాడుకున్నారు. మద్యం కుంభకోణంలో కీలకమైన పాత్ర సౌత్ గ్రూపుదేనని అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసింది.
శరత్‌చంద్రారెడ్డి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్‌తో తీహార్ జైల్లో ఉన్నారు. తాత్కాలికంగా పెరోల్ మీద విడుదలయ్యారు. ఇక సౌత్ గ్రూపులో మిగిలిపోయిన కవితకు నోటీసులు తప్పవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమెకు వ్యక్తిగత ఆడిటర్‌గా గతంలో పనిచేసిన బుచ్చిబాబును ఎంక్వయిరీ చేయడానికి ఈడీ సిద్ధమవుతున్నది. సౌత్ గ్రూపులో కవిత తరఫున బోయిన్‌పల్లి అభిషేక్, అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నది.
ఆర్థిక వ్యవహారాలు, మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలపైనే ఈడీ ఇకపై బుచ్చిబాబు ద్వారా వివరాలను రాబట్టాలనుకుంటున్నది. విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూపు నుంచి సుమారు రూ.100 కోట్లు బదిలీ అయినట్టు ఈడీ వ్యాఖ్యానించింది. ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో ఎలాంటి నిబంధనలు పెడితే ఏ రకంగా ప్రయోజనం ఉంటుందో వృత్తిపరంగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బుచ్చిబాబు సూచనలు చేసినట్టు ఈడీ పేర్కొన్నది.
బుచ్చిబాబు నోరు విప్పితే...
సీబీఐ మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత బుచ్చిబాబు నుంచి ఏమేం వివరాలు రాబట్టారన్నది ఇంకా వెలుగులోకి రాలేదు. కల్వకుంట్ల కవితకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించడంతో పాటు లిక్కర్ స్కామ్‌లో పలు కంపెనీలకు కూడా ఆయన ఆడిటర్‌గా పనిచేశారన్నది ఈడీ అభియోగం. సీబీఐ కస్టడీలో బుచ్చిబాబు వెల్లడించిన వివరాలను ఇప్పటికే ఈడీ సేకరించినట్టు తెలిసింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు అనుమతి మేరకు ఇప్పుడు బుచ్చిబాబు నుంచి ఏయే వివరాలను ఈడీ రాబడుతుందనేది కీలకంగా మారింది.
సౌత్ గ్రూపునకు లబ్ధి కలిగే విధంగా ఎక్సయిజ్ పాలసీ ఎలా ఉండాలో కవిత, ఎంపీ మాగుంట, శరత్‌చంద్రారెడ్డి జరిపిన చర్చల్లో అభిషేక్, అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, బుచ్చిబాబు యాక్టివ్‌గా వ్యవహరించారని ఈడీ ఇప్పటికే కోర్టుకు వివరించింది. హోల్‌సేల్ వ్యాపారంతో పాటు ఢిల్లీ నగరంలో రిటైల్ దుకాణాల్లో తొమ్మిది జోన్లలో మాగుంట గ్రూపు ఎక్కువ లైసెన్సులు పొందింది.
కిక్ బ్యాక్ రూపంలో అడ్వాన్సుగా సౌత్ గ్రూపు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చి ఆ తర్వాత వ్యాపారంలో భారీ స్థాయిలో ఆర్జించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. ఆర్థిక అంశాలు, అక్రమ మార్గాల ద్వారా లాభాలు గడించడం లాంటి అంశాల్లో బుచ్చిబాబు ఇచ్చిన సూచనలు, సలహాలే పాలసీ రూపకల్పనలో కీలకంగా ఉన్నందున ఎవరికి ఎంత ప్రయోజనం కలిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఎవరి నుంచి, ఎవరి ద్వారా ముడుపులు వెళ్లాయి, మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు ఏ మేరకు జరిగాయి అనే విషయాలపైనే ఈడీ ఇప్పుడు దృష్టి సారించనున్నది. బుచ్చిబాబు వెల్లడించే అంశాలు ఈడీ తదుపరి దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయి. బుచ్చిబాబు పెదవి విప్పితే ఎవరి అది ఎవరి మెడకు చుట్టుకుంటుందనే ఉత్కంఠ నెలకొన్నది.
26న మనీశ్ సిసోడియా విచారణ
సీబీఐ ఈ నెల 26న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారించనుంది. పాలసీ రూపకల్పనలో ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారన్నదానిపైనే సీబీఐ ఫోకస్ ఎక్కువ ఉంటుందనే వాదన వినిపిస్తున్నది. ఏక కాలంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నందున ఒక దగ్గరి సమాచారం మరో సంస్థ షేర్ చేసుకుంటుండడంతో క్రాస్ ఎగ్జామినేషన్ రూపంలో అధికారులు లోతుగా వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బుచ్చిబాబుకు కవిత, శరత్‌చంద్రారెడ్డితో ఉన్న సంబంధాలు, ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అనుకూలంగా నిబంధనలు ఉండేలా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలతోనూ చర్చించినందున వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇకపైన దర్యాప్తులో ప్రధానమైనవిగా మారనున్నాయి. బుచ్చిబాబు ద్వారా కవితను విచారించడానికి సీబీఐ, ఈడీ ఇకపైన ప్రయత్నాలు మొదలుపెడతాయన్న అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి : బీజేపీలో జోష్ నింపుతున్న 'కార్నర్' మీటింగ్స్! ఇక నయా ప్లాన్