తెలంగాణ ఎన్నికలపై స్పీడ్ పెంచిన ఈసీ.. వచ్చే నెల 3 నుంచి టూర్

by Javid Pasha |   ( Updated:2023-09-12 14:18:48.0  )
తెలంగాణ ఎన్నికలపై స్పీడ్ పెంచిన ఈసీ.. వచ్చే నెల 3 నుంచి టూర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక ఎన్నికల అధికారులను నియమించింది. రిటర్నింగ్ అధికారుల నియామకం కూడా గత కొద్దిరోజుల క్రితం పూర్తి చేసింది. ఈవీఎంలను సిద్దం చేసుకోవడంతో పాటు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియను కూడా ఈసీ చేపడుతోంది. అంతేకాకుండా ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి అడ్డకట్ట వేసేందుకు ఇటీవల రాష్ట్ర పోలీసులు, ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ అధికారుతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ మరింత స్పీడ్ పెంచింది. వచ్చే నెల మూడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఈసీ అధికారులు పర్యటించనున్నారు. వచ్చే నెల 3 నుంచి 5వరకు పర్యటించనున్న అధికారులు.. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలీస్ బందోబస్తు వంటి అంశాలపై సీఈసీ అధికారులు పరిశీలన చేపట్టనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర అధికారులకు పర్యటనకు సంబంధించిన వివరాలను పంపింది. దీంతో అందుకు తగ్గట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఇటీవల జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలు, బోగస్ ఓట్ల గుర్తింపు లాంటి అంశాలపై చర్చించారు. కొత్త ఓటర్ల నమోదు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఓటర్ జాబితాలోని సవరణలను పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Next Story