రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ .. BRS వర్గాలకు అందిన ఇన్ఫో?

by GSrikanth |   ( Updated:2023-02-05 00:30:18.0  )
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ .. BRS వర్గాలకు అందిన ఇన్ఫో?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అలాంటి అవకాశం లేనే లేదని స్వయంగా ముఖ్యమంత్రి సహా మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ విపక్షాలు మాత్రం ఇప్పటికీ బలంగా విశ్వసిస్తున్నాయి. దీనిపై స్పష్టత రాకముందే కేంద్ర ఎన్నికల సంఘమే ముందుగా నిర్వహించడంపై సమాచాలోచనలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు ఈ తరహా లీకులు రావడంతో జాగ్రత్త పడినట్లు తెలిసింది. జూలై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే హడావిడిగా బడ్జెట్ సెషన్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది చివర్లో మిజోరాం రాష్ట్రానికి, జనవరిలో తెలంగాణ సహా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు జరగాల్సి ఉన్నది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణాధికారంతో ఐదు రాష్ట్రాలకూ కలిపి మూడు నెలల ముందుగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణకు 2018లో డిసెంబరులో ఎన్నికలు జరిగినా మొదటి అసెంబ్లీ సెషన్ 2019 జనవరి 17న జరగడంతో కాలపరిమితి 2024 జనవరి 16 వరకు ఉన్నది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు కూడా 2024 జనవరి 4-15 తేదీల మధ్యలో ఉన్నది. ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణాధికారం ప్రకారం ఆరు నెలల ముందు ఎప్పుడైనా షెడ్యూలును రూపొందించే అవకాశం ఉన్నది. ఆ ప్రాతిపదికన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి నిర్వహించినా ఆశ్చర్యమేమీ లేదనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నది.

ఒకవైపు ఈ రాష్ట్రాల కాలపరిమితికి కోత పెట్టడంతో పాటు ఊహకు అందని విధంగా నిర్ణయం తీసుకుని పార్టీలకు చిక్కులు సృష్టించాలన్న కుట్ర ఉన్నదనే అభిప్రాయాన్ని గులాబీ నేతలిద్దరు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పసిగట్టినందునే హడివిడిగా అసెంబ్లీ సెషన్‌ను ఒక నెల ముందుకు జరిపి నిర్వహించాల్సి వచ్చిందన్న లోగుట్టును బైటపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే పూర్తి టైమ్ పాలిటిక్స్ మీద కేంద్రీకరిస్తారని, బడ్జెట్‌లో పేర్కొన్న హామీలు, నిధుల కేటాయింపుకు తగినట్లుగా సంక్షేమం, అభివృద్ధిపై అధికారులు దృష్టి పెడతారని సూచనప్రాయంగా తెలిపారు. ఎమ్మెల్యేలు ఎక్కువగా వారి నియోజకవర్గాల్లోనే తిరగడం, ఇప్పటికే అమలవుతున్న వెల్ఫేర్ స్కీమ్ ఫలాలను లబ్ధిదారులకు అందించడంపైన ఫోకస్ పెట్టడం, పెండింగ్‌లో ఉన్న పనులు సత్వరం పూర్తయ్యేలా పర్యవేక్షించడం తదితరాల గురించి అధినేత నొక్కిచెప్పినట్లు తెలిసింది.

ముందస్తు ఎన్నికలు ఉండవంటూ సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పదేపదే దాన్నే ప్రస్తావిస్తూ ఉన్నారు. కేసీఆర్ పైకి ముందస్తు ఉండదని చెప్తున్నా ఆరు నెలల ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ కేడర్‌కు స్పష్టం చేశారు. వీరి ఉద్దేశం ప్రకారం అసెంబ్లీ రద్దయితే ముందస్తు ఎన్నికలు వస్తాయనేది. కానీ బీఆర్ఎస్ ప్రకారం మాత్రం కేంద్ర ఎన్నికల సంఘమే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మూడు నెలల ముందుకు ఎన్నికల ప్రక్రియను జరిపే అవకాశం ఉందని అనుమానిస్తున్నది. ఈ అనుమానంతోనే పరిపాలనాపరంగా, రాజకీయపరంగా తగిన గ్రౌండ్‌ను సిద్ధం చేసుకుంటున్నది.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నెల రోజుల ముందుగా ప్లాన్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు అనుమానాలు బలపడ్డాయి. కానీ ఎలక్షన్ కమిషనే ఈ నిర్ణయం తీసుకుంటుందని గ్రహించలేదు. కానీ బీఆర్ఎస్ అధినేతకు మాత్రం జూలై తర్వాత కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదని, రాజ్యాంగపరంగా లభించిన గడువుకు కోతపెట్టినా ప్రశ్నించే అవకాశం ఉండదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ సహా చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా సంక్షోభంతో చివరకు అది బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈసారి ఆ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లబ్ధి పొందేలా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇలాంటి పథకానికి రూపకల్పన చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed