ఈ -నామ్ సైట్ హ్యాక్.. వ్యవసాయ మార్కెట్లో ట్రేడ‌ర్ దగా

by Sathputhe Rajesh |
ఈ -నామ్ సైట్ హ్యాక్.. వ్యవసాయ మార్కెట్లో ట్రేడ‌ర్ దగా
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మ‌హ‌బూబాబాద్ మార్కెట్‌లో ఈ- నామ్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ ట్రేడింగ్ కంపెనీ అక్రమాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తోటి వ్యాపారులు ఎంత ధర కోట్ చేస్తున్నారో ముందే తెలుసుకుని, వారి క‌న్నా స్వల్ప మొత్తంలో ఎక్కువ‌గా కోట్ చేస్తూ రైతుల పంట ఉత్పత్తుల‌ను దక్కించుకుంటున్నాడు. ఒకే కంపెనీకి అనేక‌సార్లు పెద్ద మొత్తంలో స‌రుకు ద‌క్కుతుండ‌టంతో అనుమానం క‌లిగిన వ్యాపారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఐటీ అధికారుల త‌నిఖీల‌తో విష‌యం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వ‌చ్చిన ఈ సంఘ‌ట‌న‌పై మార్కెటింగ్ శాఖ అధికారులు మ‌హ‌బూబాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన కొంత‌మంది ప్రజాప్రతినిధులు మాత్రం అక్రమార్కుడి వైపే నిలిచి త‌మ బుద్ధిని చాటుకుంటున్నట్లుగా వ్యాపార వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

రైతుల‌కు ధ‌ర ద‌క్కకుండా చేశాడా.?

వాస్తవానికి స‌ద‌రు వ్యాపారి కొంత‌మంది త‌న మిత్రుల‌కు కూడా కోట్ వివ‌రాల‌ను లీక్ చేస్తూ మొత్తంగా మార్కెట్‌లో రైతుల‌కు పెద్దగా ధ‌ర ద‌క్కకుండా కుట్ర చేసిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు అధికారి కాంటాక్ట్ లిస్టుల‌ను, ఫోన్ కాల్స్ వివ‌రాల‌ను పోలీసులు సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప‌రిశీలిస్తే ఈ మొత్తం వ్యవ‌హారానికి సంబంధించిన కీల‌క ఆధారాలతో పాటు లింకులు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని వ్యాపారులు, రైతులు సూచిస్తున్నారు.

సైబర్ క్రైం పోలీసులకు అధికారులు, సంబంధింత వ్యక్తిపై ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకుబడి మూలంగానే అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను నట్టేట ముంచేందుకు పన్నాగం పన్నిన వ్యాపారిపై రైతులు, రైతు సంఘ నాయకులు మండిపడుతున్నా రు. వెంటనే ఆ వ్యాపారి లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ నామ్ విధానం ఇదీ..

వ్యవసాయ వస్తువుల కోసం ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానాన్ని ప్రవేశపెట్టింది. మార్కెట్‌లో రైతులు అడుగుపెట్టినప్పటి నుంచి సరుకు అమ్ముకొనే వరకు అంతా ఆన్ లైన్‌లోనే జరుగుతుంది. వ్యాపారులు కొనుగోలుదారులు పోటీ ద్వారా కొనుగోలు చేయడం మూలంగా రైతులకు ధర కలిసివచ్చే అవకాశం ఉంటుంది. రైతులు మార్కెట్‌కు ఎంట్రీ అవ్వగానే ఎంట్రీ పాస్ తో పాటు సరుకుకు డిజిటల్ నెంబర్‌ను కేటాయించి ఒక రశీదును అందజేస్తారు. ఏ సరుకులు తెచ్చాడు, ఎన్ని బస్తాలు తెచ్చాడో రైతు సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేసుకుంటారు.

హ్యాక్ జరిగింది వాస్తవమే..

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో లైసెన్స్ కల్గిన ఓ ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యాపారి ఈ-నామ్ మార్కెట్ సంబంధించిన సాఫ్ట్ వేర్‌ను హ్యాక్ చేసినట్లు గుర్తించాం. ఈ విషయం ఈ -నామ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పోలీసులకు కూడా సమాచారం అందజేశాం.

– రాజేందర్, మహబూబాబాద్ మార్కెట్ ఇన్​చార్జి కార్యదర్శి

Advertisement

Next Story

Most Viewed