మందుబాబులూ జర జాగ్రత్త.. అంతా నాసిరకమే!

by srinivas |
మందుబాబులూ జర జాగ్రత్త.. అంతా నాసిరకమే!
X

దిశ, సూర్యాపేట టౌన్: మందుబాబులు మోసానికి గురవుతున్నారు. మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరాగా చేసుకొని జిల్లాలోని కొన్ని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్‌ల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు అంట గడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పర్యవేక్షించే వారు పట్టించుకునే వారు కరువు కావడంతో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తుంది. మరోవైపు వైన్ షాప్, బార్ల నిర్వహణలో సమయపాలన పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. తెల్లారిదాకా గేట్ వెనక నుండి అమ్మకాలు నడిపిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని తెలుస్తుంది. దీంతో మందుబాబుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

ధర ఎక్కువ నాణ్యత తక్కువ.

సూర్యాపేట జిల్లా కేంద్రం కావడంతో గతం కంటే రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపారం జోరందుకుంది. నిత్యం అవి మందు బాబులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం సేవిస్తున్న సమయంలో ఏదైనా తీసుకోవడం పరిపాటి అయితే మందు బాబులకు వైన్స్, రెస్టారెంట్ల నిర్వహకులు కలుషిత నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైకి హంగు ఆర్భాటం కనిపిస్తున్న ఉండేది మాత్రం పూర్తిగా కలుషిత మేనని తెలుస్తుంది.

రెండు మూడు రోజులపాటు నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో జిల్లా కేంద్రంలో కొద్దీ రోజుల క్రితం కొత్త బస్టాండ్ దగ్గరలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మందు బాబులకు బార్ నిర్వాహకులకు వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే.ధరల విషయం లో చూపించే శ్రద్ధ నాణ్యతలో చూపడం లేదని పలువురు మందుబాబులు మండిపడుతున్నారు.

నిబంధనలు బేఖాతర్

వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లలో వండే ఆహారంలో సరుకులు ఏరోజుకారోజు వినియోగించాల్సి ఉంది . వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడొద్దు భోజనం తయారు చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. వినియోగదారులు మిగిల్చిన ఆహారాన్ని వెంటనే పడేయాలి. ఆహార పదార్థాలు మాంసం మిగిలితే వాటిని ఫ్రిజ్ లో పెట్టొద్దు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్ లు ఉదయం సమయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచాలి. సమయం దాటాక మందు విక్రయాలు జరపొద్దనే నిబంధనలు ఉన్నాయి.అవేమి సూర్యాపేట జిల్లాలో అమలు కావడంలేదని తెలుస్తుంది.

పర్యవేక్షణ శూన్యం.

సూర్యాపేట జిల్లాలోని వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్‌ల‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా ఏ మాత్రం లేదనే భారీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా విక్రయాలు జరుగుతున్న ఎక్సైజ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా సంబంధిత శాఖ అధికారులు కన్నేత్తి చూసిన దాఖలాలు కూడా లేవనే విమర్శలు ఉన్నాయి. నిర్వాహకులకు కొందరు అధికారులే వెన్నుదన్నుగా నిలుస్తారనే బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు సూర్యాపేట జిల్లాలోని వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి నాణ్యతలేని పదార్థాలను విక్రయాలు జరుపుతున్న రెస్టారెంట్ల పై చట్టపరమైన చర్యలు తీసుకొని మందుబాబుల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

వెంటనే తనిఖీలు చేపడతాం

కిరణ్ కుమార్ సూర్యాపేట జిల్లా.

- ఇంచార్జ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్.

వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లలో ఆహారం కల్తీ అవుతుందన్న విషయం మా దృష్టికి రాలేదు. అలా ఏమైనా మా దృష్టికి వస్తే వెంటనే తనిఖీలు చేపడతాం .ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను, బేకరీలను రెస్టారెంట్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం ఎవరైనా నిబంధనలు పాటించకుండా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లలో కల్తీ పదార్థాలు అమ్మితే వారిపై మా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed