దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు : సీఎం రేవంత్ రెడ్డి

by Y.Nagarani |   ( Updated:2024-10-15 09:26:15.0  )
దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు వేయబోతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేవీలో వాడే అన్నిరకాల ఆయుధాలను తయారు చేసే నగరంగా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందన్నారు. రక్షణ రంగానికి చెందిన అనేక సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. దేశానికి మూడు వైపులా సముద్రం ఉందని, వాటిలో ప్రయాణించే షిప్ లు, వ్యవస్థలను మానిటరింగ్ చేసే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ను వికారాబాద్ లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అంశాన్ని చాలారకాలుగా చాలా మంది వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించారని, ఈ రాడార్ స్టేషన్ తో ప్రజలకు లేనిపోని అపోహల్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమిళనాడులో వీఎల్ఎఫ్ ను 1990లో ప్రారంభించారని, అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టం, నష్టం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ వికారాబాద్ లో ఏర్పాటు చేయడం, దీనిని ప్రారంభించేందుకు స్వయంగా రాజ్ నాథ్ సింగ్ రావడంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను అందరూ గుర్తించాలన్నారు. దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ భద్రత, రక్షణ గురించి ఆలోచించాలని సూచించారు. దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. 2017లోనే నేవీ రాడార్ స్టేషన్ కు సంబంధించిన భూ కేటాయింపులు జరిగాయన్నారు. నేడు తమ హయాంలో ఈ ప్రాజెక్టుపై రాజ్ నాథ్ సింగ్ ముందుకు వచ్చారన్నారు. దేశభద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టుపై లేనిపోని వివాదాన్ని సృష్టించవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పార్టీలకు అతీతంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.


👉Also Read: దామగుండం రాడార్ స్టేషన్ దేశం గర్విచదగ ప్రాజెక్ట్: రాజ్‌నాథ్ సింగ్

Next Story

Most Viewed